‘దిశ’ టీవీకి కేటీఆర్ లీగల్ నోటీస్.. తగ్గేదేలే అన్న యాజమాన్యం

by Disha Web Desk 19 |
‘దిశ’ టీవీకి కేటీఆర్ లీగల్ నోటీస్.. తగ్గేదేలే అన్న యాజమాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దిశ టీవీలో ప్రసారమైన వీడియోలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. తక్షణం వాటిని యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని సంస్థ యాజమాన్యానికి లాయర్ ద్వారా నోటీసులు పంపారు. ఇకపైన ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని, ఇప్పటికే ప్రసారమైన రెండు వీడియోలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో కేటీఆర్ తరఫున లాయర్ (పీవీ జనని అండ్ అసోసియేట్స్) పేర్కొన్నారు. మొత్తం నాలుగు షరతులు పేర్కొన్న లాయర్ వారం రోజుల్లోగా ఆ రెండు లింకులను డిలీట్ చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ లింకులను తొలగించకపోతే సివిల్, క్రిమినల్ తదితర చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వార్తల కారణంగా కేటీఆర్‌కు ఇప్పటికే జరిగిన నష్టానికి ఈ నోటీసు జారీ చేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.

ఆ రెండు వీడియోల్లో ఏమున్నది..?

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినవే ఆ రెండు వీడియోలు. పలువురు ఎస్ఐబీ మాజీ అధికారులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలనే వీడియో (వాయిస్ ఓవర్‌తో) రూపంలో ‘దిశ’ యూట్యూబ్ చానెల్ ఈ నెల 1, 10 తేదీల్లో ప్రసారం చేసింది. పోలీసు వర్గాల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ఈ వార్తలు ప్రసారమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల బహిరంగంగానే చిప్పకూడు తినిపిస్తాం.. చర్లపల్లి జైల్లో పెడతాం.. అక్కడే కుటుంబం మొత్తానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టిస్తాం.. భార్యాభర్తల మాటలూ వింటారా?.. సిగ్గుండాలి.. ఇలాంటి కామెంట్లు చేశారు. వీటినే ఆ రెండు వీడియోల్లో ‘దిశ’ ప్రస్తావించింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే జరిగిందని, ఆయనకే ఎప్పటికప్పుడు వివరాలు తమ శాఖ ఉన్నతాధికారుల ద్వారా అందుతూ ఉండేవని.. ఇటీవల రాధాకిషన్‌రావు తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో చెప్పారని పోలీసు వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మరో వీడియోలో ‘దిశ’ ప్రస్తావించింది. ఈ రెండు వేర్వేరు వీడియోల్లోని అంశాలు తమ క్లయింట్‌ కేటీఆర్ ప్రతిష్టకు భంగంకరంగా మారాయని, గతంలో మంత్రిగా పనిచేసి సమాజంలో లక్షలాది మంది అభిమానులున్న ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉన్నదని లాయర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పలు టీవీ చానెళ్ళలో, పత్రికల్లో ఎస్ఐబీ మాజీ అధికారులు పోలీసు కస్టడీలో ఇవే విషయాలను వెల్లడించినట్లు ప్రచురించాయి. ‘దిశ’ కూడా సీఎం వ్యాఖ్యలను ఉటంకిస్తూనే వీడియోలను ప్రసారం చేసింది.

ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియోలు కాదు: దిశ యాజమాన్యం

కేటీఆర్ తన లాయర్ ద్వారా పంపిన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నరెండు వీడియోలూ వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పోలీసు వర్గాలు పేర్కొన్న అంశాలే తప్ప ‘దిశ’ తనకు తానుగా ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేసినవి (అప్‌లోడ్) కావు. కేటీఆర్ ప్రతిష్టను, నైతికతను కించపర్చాలనే ఉద్దేశం కూడా లేదు. వీటిని తొలగించాలని కేటీఆర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ వాటిని ‘దిశ’ పనిగట్టుకుని ప్రచారం చేసినవి కాకపోవడంతో వాటిని తొలగించడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు. బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా సుముఖంగా లేదు.



Next Story

Most Viewed