KTR: ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? : కేటీఆర్

by Rani Yarlagadda |   ( Updated:2024-11-17 12:43:34.0  )
KTR: ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతులను మోసం చేస్తోందని కొద్దిరోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ X వేదికగా ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. తాజాగా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చురేపింది. ఆ దాడి వెనుక పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో.. నిన్న ఉదయం అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనను ఏదొక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ముందే తెలుసని, రైతుల గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు. తాము కుట్ర చేశామంటున్న రేవంత్ రెడ్డి ఆ కుట్రేంటో చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

"ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? రూ.50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో" అని కేటీఆర్ ధ్వజమెత్తారు.


👉 Click Here For Tweet!

Advertisement

Next Story