రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి మీటింగ్‌.. కీలక నేత భవితవ్యంపై సస్పెన్స్!

by Rajesh |   ( Updated:2023-01-21 06:55:58.0  )
రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి మీటింగ్‌.. కీలక నేత భవితవ్యంపై సస్పెన్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు, గాంధీ భవన్ వైపు చూడని ఆయన సడెన్‌గా శుక్రవారం గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. అప్పటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో దాదాపు గంట పాటు సమావేశం అయి వివిధ అంశాలపై ముచ్చటించారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం.. మునుగోడుకు బై పోల్ రావడంతో పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్లుగా వ్యవహారం సాగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన 'హోంగార్డ్' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇదిలా ఉంటే చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ కోమటిరెడ్డి విషయంలో మరింత మంట పెట్టాయి.

ఈ పరిణామం పార్టీలో భారీ కుదుపుకు కారణం అయింది. అసలు కారణం ఏదైనప్పటికీ వెంకట్ రెడ్డి మాత్రం అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై సీరియస్‌గా‌నే రియాక్ట్ అయ్యారు. పార్టీ కోసం దశాబ్దాల పాటు పని చేసిన తనను అనరాని మాటలతో దూషించిన దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే అని పట్టు పట్టారు. దీంతో అసలే ఉప ఎన్నిక వేళ కావడంతో పరిస్థితి చక్కదిద్దుకునేందుకు తన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ వెంటనే క్షమాపణలు చెప్పారు.

అలాగే రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను తప్పు పడుతూ క్షమాపణలు కోరారు. అయినా వెంకట్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే అని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు జరగడం కోమటిరెడ్డి మౌనం వహించడంతో ఆ విషయం కూడా కాస్త మరుగున పడింది.

అయితే కొత్త ఇన్ ఛార్జి రాకతో అనూహ్యంగా గాంధీ భవన్ మెట్లు ఎక్కిన కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎంతో చనువుగా మాట్లాడటం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. పార్టీ సోషల్ మీడియా గ్రూపులలో జోష్ వచ్చింది. కానీ పైకి కనిపించినంత సాఫీగా భవిష్యత్‌లో వ్యవహారం ఉంటుందా అనేదే సస్పెన్స్‌గా మారింది. పార్టీ కోసం ముందుకు వచ్చానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నా తనపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ విషయంలో తన వైఖరి ఏంటి అనేది అసలు సందేహం.

మునుగోడు ఉప ఎన్నికలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి చొరవ చూపారు. అయితే గతంలో దామోదర్ రెడ్డికి కోమటి రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అలాగే దామోదర్ రెడ్డిపై అద్దంకి దయాకర్‌కు సైతం ఆధిపత్య పోరు గతంలో కొనసాగింది. వీరిద్దరు అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసుకునేంత వరకు వ్యవహారం వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కోమటిరెడ్డి మీద కోపంతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో దామోదర్ రెడ్డి తనకు పడిరాని అద్దంకి దయాకర్‌తో చనువుగా ఉన్నారనే టాక్ వినిపించింది.

అయితే అద్దంకికి దామోదర రెడ్డి మద్దతు తెలపడం కోమటిరెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించిందని అందువల్లే దయాకర్ క్షమాపణలు చెప్పినప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి పట్టుపట్టినట్టు గుసగుసలు వినిపించాయి. ఈ వ్యవహారం ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వెంకట్ రెడ్డి.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో దళిత వర్గానికి చెందిన అద్దంకిని బలి చేస్తున్నారనేది కూడా గతంలో వినిపించింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి స్టాండ్ ఎలా ఉంటుంది అనేది కీలకం కాబోతోంది.

Also Read...

50 సీట్లపై గురి..! Congress స్కెచ్ ఫలించేనా..?

Advertisement

Next Story

Most Viewed