Komatireddy Venkat Reddy: మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్.. కేటీఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్

by Prasad Jukanti |
Komatireddy Venkat Reddy: మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్.. కేటీఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమృద్ధిగా వర్షాలు పడి రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆషాడం బోనాల సందర్భంగా ఇవాళ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేలే కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదనే అనుమానాలు కలుగుతున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని సెటైర్ వేశారు. కేటీఆర్ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్ భూమి లోపలకి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. కేటీఆర్ విమర్శలకు సమాధానం చెబితే పండగ రోజు వాతావరణం పాడవుతుందని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసినా భవిష్యత్ లో మూడు బ్యారేజీలు ఉంటాయని గ్యారెంటీ లేదని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని ఆ రిపోర్టును కేటీఆర్ కు తాను పంపిస్తానన్నారు.

పాతబస్తి స్థితిగతులు మార్చేస్తాం:

ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్ తో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, హైకోర్టును పునర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ బీ ద్వారా ఈ పనులన్నింటికీ బడ్జెట్ ను రిలీజ్ చేస్తామన్నారు. పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story