లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-10-22 16:57:30.0  )
లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంపై కేంద్ర జలశక్తి శాఖకు తానే స్వయంగా లేఖ రాస్తానని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు సేఫ్టీపై సమగ్రమైన దర్యాప్తు జరగాలని ఆయన పేర్కొన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించాలని, పరిశీలనకు వస్తే అడ్డుకోవద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ అంటూ ప్రచారం చేసుకుంటోందని, కానీ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడంతో లోపాలు తెలియకూడదని ఎవరినీ అనుమతించడంలేదని ఆయన మండిపడ్డారు.

ఇంజనీర్లను కూడా పరిశీలనకు పంపించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ తరుపున ఈటల రాజేందర్ పరిశీలనకు వెళ్లారని ఆయన తెలిపారు. వేల కోట్లు ఖర్చు పట్టి కాళేశ్వరం నిర్మించారని, ఇంజినీరింగ్ మార్వెల్ అని కేసీఆర్ జబ్బలు చరుచుకున్నారని, కేసీఆరే ఇంజినీర్ లా వ్యవహరించి.. డిజైన్ చేశారని చెప్పుకున్నారని ఎద్దేవాచేశారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని సీఎం చెప్పారని, మరి ఎందుకు కుంగిపోయిందో ఆయన సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం.. తెలంగాణ సంపదకు చిల్లులు వేసే ప్రాజక్ట్ అని ఆయన విమర్శలు చేశారు.

ఫస్ట్ లిస్ట్‌‌లో బలమైన అభ్యర్థులు

పార్టీ కేంద్ర ఎలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే తొలి జాబితాను విడుదల చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ఫస్ట్ లిస్ట్ లో ఉన్నవారంతా బలమైన అభ్యర్థులుగా పార్టీ గుర్తించిందని వెల్లడించారు. దసరా తర్వాత రెండో దఫా లిస్ట్ ప్రకటన ఉంటుందని, ఢిల్లీలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు. త్వరలో మోడీ, అమిత్ షా భారీ బహిరంగ సభలు ఉండబోతున్నాయని తెలిపారు. దసరా తర్వాత ఉధృతంగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలను కాకుండా బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడాలని, ఈ రెండు పార్టీలు కుటుంబ పాలన, అవినీతిలో కవలపిల్లలని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, అధికారులు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై కేసులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ బెదిరింపులకు అధికారులు తలొగ్గొద్దని సూచనలు చేశారు. ఇకపోతే జనసేనతో పొత్తుపై ప్రాథమికంగా ఒకసారి కలిశామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, నిర్ణయం తీసుకుంటే చెబుతామని పేర్కొన్నారు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం గురించి ఎంతో ఊహించుకున్నారని, డీపీఆర్ ప్రకారం నిర్మిస్తే ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడేదని, కానీ కేసీఆర్ అడ్డగోలుగా నిర్మించడంతో ఉపయోగం లేకుండా పోయిందని విమర్శలు చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల కరెంట్ బిల్లులు ఎక్కువయ్యాయని, ఎన్నో లోపాలు ఉన్నాయన్నారు. ఖర్చు ఎక్కువ.. లాభాలు తక్కువగా ఆయన పేర్కొన్నారు. ఒక్కో బ్యాంకుకో డీపీఆర్ ఇచ్చి బ్యాంకులను కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే.. కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదన్నారు. వరల్డ్ గ్రేటెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిచిందని ఆయన చురకలంటించారు.

Advertisement

Next Story

Most Viewed