పదేళ్లుగా ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: కిషన్ రెడ్డి

by GSrikanth |
పదేళ్లుగా ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు: కిషన్ రెడ్డి
X

దిశ, అంబర్ పేట: ప్రతిపక్ష పార్టీల్లో ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడే లేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గత పదేండ్లుగా మోడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేశారని, ఆ నాయకుడిని మరోసారి ప్రధానిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అంబర్‌పేట నియోజకవర్గంలో సోమవారం కిషన్ రెడ్డి జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మోడీ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. మూడేండ్ల కిందట మొదలైన ఉచిత బియ్యం పంపిణీ మరో ఐదేండ్ల పాటు కొనసాగించనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారని చెప్పారు. ఏ ఇంట్లో చూసినా ఎవరి నోట విన్నా ఒక్కటే మాట మోడీ మోడీ అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్​దొందు దొందే

మోడీ పాలనలో దేశంలో మాఫియా, గూండాయిజం లేదని, కర్ఫ్యూలు, అల్లర్లు లేవని, దేశం ప్రశాంతంగా ఉందని కిషన్​రెడ్డి గుర్తుచేశారు. దేశం మోడీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందన్నారు. ‘‘మోడీ ప్రధాని అయినప్పుడే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్‌కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం ఫాం హౌజ్‌లోనే ఉన్నారని విమర్శించారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు కాబట్టే ఆయనను రాష్ట్ర ప్రజలు ఫామ్​హౌస్‌కే పరిమితం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. మహిళలకు రూ.2500 రావడం లేదని, నిరుద్యోగులకు భృతి రావడం లేదని, కొత్త రేషన్​కార్డులు రాలేదు, కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చండి, సికింద్రాబాద్ ఎంపీగా నన్ను ఆశీర్వదించండి అని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed