మీరు తెలంణానోళ్లు కాదు...మేం సర్వే చేయం...

by Sridhar Babu |
మీరు తెలంణానోళ్లు కాదు...మేం సర్వే చేయం...
X

దిశ, భద్రాచలం : వారంతా తెలంగాణలో జరిగే పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఇక్కడే ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో జీవించడం ఇప్పుడు వారి కొంప ముంచింది. మీరంతా ఆంధ్రోళ్లు.. మీ కుటుంబాలను మేము సర్వే చేయం అని అధికారులు పేర్కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలను ఆంధ్రలో విలీనం చేశారు. విభజన సమయంలో అధికారుల అవగాహన లోపం కారణంగా కొన్ని కాలనీలు సగం ఆంధ్రాలో, సగం తెలంగాణలో ఉండిపోయాయి. ఆంధ్రలో విలీనం అయిన సరిహద్దులో నివసించే కొన్ని కుటుంబాలు విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు.

అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయంలో వారిని తెలంగాణ ప్రజలుగా అధికారులు భావించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీలోని 19వ వార్డులో నివసించే సుమారు 20 కుటుంబాలకు చెందిన వారిని సర్వే చేయడానికి అధికారులు నిరాకరించడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆధార్, ఓటర్ ఐడీ కలిగి ఉన్నామని, తెలంగాణలోనే రేషన్ తీసుకుంటున్నామని, పథకాలు పొందుతున్నామని, ఇక్కడే ఓటు వేస్తున్నామని, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు సర్వే చేయరని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమస్య దుమ్ముగూడెం మండలం సిరిగుండం గ్రామంలో కూడా ఎదురైంది. ఆ గ్రామంలో నివసించే సుమారు 40 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఓటు హక్కును వినియోగించుకుంటూ, ఇక్కడే అన్ని ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. కానీ ఆ గ్రామం సరిహద్దు రాష్ట్రం ఆంధ్రాలో ఉందని అధికారులు సమగ్ర సర్వే జాబితా నుండి ఆ గ్రామాన్ని తొలగించారు. వారందరూ అమాయక గిరిజనులు కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గిరిజన సంఘాలను, ఎమ్మెల్యే వెంకట్రావును కలిసి తమ గోడు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు వీరికి ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. సమగ్ర కుటుంబ సర్వే కారణంగా వారంతా ఆంధ్రాలో ఉంటున్నారని అధికారులకు తెలవడంతో తమ రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తారేమోనని సరిహద్దులో నివసించే ప్రజలు భయపడుతున్నారు.

ఆంధ్రలో ఉండటంతోనే సర్వే చేయలేదు : తహసీల్దార్ శ్రీనివాస్

భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీలోని సుమారు 20 కుటుంబాల ప్రజలు సరిహద్దు అయిన ఆంధ్ర రాష్ట్రంలోని ఎటపాక మండలానికి చెందిన భూమిలో నివాసాలు ఏర్పర్చుకున్నారు. దాంతో ఆ కుటుంబాలను సమగ్ర కుటుంబ సర్వే జరపలేదు.

Advertisement

Next Story