Pedavagu project : పెదవాగు ప్రాజెక్టును పునర్నిర్మిస్తాం

by Sridhar Babu |
Pedavagu project : పెదవాగు ప్రాజెక్టును పునర్నిర్మిస్తాం
X

దిశ, అశ్వారావుపేట : 80 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వచ్చిన తట్టుకునే సామర్థ్యానికి పెదవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాలకు మునుపెన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో గండిపడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. వరద దాటికి ధ్వంసమైన ఆనకట్ట తూములను ఉన్నతాధికారులతో కలిసి తుమ్మల పరిశీలించారు.

అనంతరం కొత్తూరు గ్రామంలో కరెంట్ షాక్ గురై మృతి చెందిన వెల్డింగ్ షాప్ యజమాని చాపర్ల మురళి కుటుంబాన్ని తుమ్మల పరామర్శించి.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరద ముంపు ప్రాంతంలో పర్యటించి ప్రస్తుత పరిస్థితిని స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. గుమ్మడవల్లి డిగ్రీ కళాశాలలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి తుమ్మల మాట్లాడారు. పెదవాగు ప్రాజెక్టు గండిపడటంతో అపార నష్టం సంభవించిందన్నారు. ఊహించనంత వరద వచ్చిన మాట వాస్తవమే కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారని, నివేదికల ఆధారంగా ప్రభుత్వం చర్యలు ఉండనున్నాయన్నారు.

మా కష్టాలు మీకే తెలుసు సార్

పెదవాగు ఆనకట్ట పై మంత్రి తుమ్మలను బాధితులు కలిశారు. ఈ ప్రాంత సమస్యలు మా కష్టాలు పట్ల మీకు పూర్తిగా అవగాహన ఉందని.. మీరు ప్రత్యేక శ్రద్ధ చూపితేనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. మీ ద్వారానే సన్న చిన్న కారు రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. స్పందించిన మంత్రి తుమ్మల అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఆధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.

జిల్లా ఎస్పీ, కలెక్టర్ సేవలు భేష్

సమయానికి స్పందిస్తే కష్టాల్లో ఉన్న వారిని ఎలా కాపాడుకోవచ్చని.. పెదవాగు వరదలో చిక్కుకున్న 31 మందిని రక్షించి భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నిరూపించారని తుమ్మల ప్రశంసించారు. పెదవాగు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనాస్థలాకి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారన్నారు. అధికారులు సమన్వయంతో సేవలు అందించడం వల్లే ప్రాణ నష్టం తప్పిందన్నారు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో బి.రాహుల్ లను మంత్రి అభినందించారు.

పంట నష్టపరిహారం సీఎం దృష్టికి తీసుకెళ్తా...

పెదవాగు వరదకు ఎన్ని ఎకరాలు ఇసుక మేటలు వేసి, పంట కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందనే అంచనాలు తయారు చేశారని, కలెక్టర్ నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరగా నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇళ్లు మునిగి కూలిపోయిన వారికి వెంటనే నష్టపరిహారం అందించాలనే ఆదేశించాను. నీరు చేరిన బాధితులకు బియ్యం, నూనె, కందిపప్పు పంపిణీ చేస్తున్నాం అన్నారు. పునరావాస కేంద్రంలో ఉన్న 250 మందికి కావాల్సిన ఏర్పాట్లు చేశామని, కరెంట్ షాక్ కు గురైన చాపల మురళి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

వచ్చే సీజన్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తాం

పెదవాగు ప్రాజెక్టు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కాబట్టి.. బాధ్యతను గోదావరి రివర్ బోర్డు చూస్తుందన్నారు. ప్రాజెక్టు ఆయకట్ట 80 శాతం ఆంధ్ర ప్రాంతంలో ఉండడంతో ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పునర్నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్తామన్నారు. గోదావరి రివర్ బోర్డ్ తో చర్చించి ప్రాజెక్టుకు భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేస్తాం అన్నారు. అవసరమైతే మరిన్ని గేట్లను ఏర్పాటు చేసి నీటి విడుదల సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతికపరమైన అంశాలను కూడా పరిశీలిస్తామన్నారు. వచ్చే సీజన్ కల్లా పునర్నిర్మాణం పూర్తి బాధ్యతను ప్రభుత్వ పరంగా తీసుకుంటానని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed