ఓల్డ్ స్టాక్ తో ‘వైన్స్’ లాస్!

by Javid Pasha |
ఓల్డ్ స్టాక్ తో ‘వైన్స్’ లాస్!
X

దిశ బ్యూరో, ఖమ్మం : మద్యం ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. క్వార్టర్ కు రూ.10, ఫుల్ బాటిల్ కు గరిష్టంగా రూ. 40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ధరల తగ్గింపును తర్వాతి రోజు నుంచే అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇదే వైన్ షాపులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నది. షాపుల్లో ఉన్న పాత స్టాక్ ను పాత ధరలకే అమ్ముకోవచ్చని చెప్పినా, మందుబాబులత నుంచి నిరసన ఎదురవుతున్నది. పాత స్టాక్ ను పాత ధరలకు అమ్ముతుంటే కస్టమర్లు గొడవలు, ఆందోళనకు దిగుతున్నారని మద్యం వాప్యారులు వాపోతున్నారు. ఈ ఏడాది ఒక్కో మద్యం దుకాణాదారుడికి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు నష్టం వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపుల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని చెబుతున్నారు.

రేట్లు పెంచినప్పుడు అలా..

గతంలో మద్యం ధరలు పెంచినప్పుడు కూడా మరుసటి రోజు నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పుడు ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి, షాపుల్లోని స్టాక్ ను లెక్కవేశారు. తగిన టారిఫ్ ను పరిగణనలోకి తీసుకొని, ఎక్సెస్ అమౌంట్ ను తీసుకుని కొత్త ధరలకు విక్రయాలు జరిపించారు. పాత ఎమ్మార్పీ ఉన్నా పెరిగిన ధరలకే విక్రయించాల్సిందిగా ఆదేశాలు జారీ కావడంతో అనేక ఇబ్బందుల నడుమ వైన్ షాపుల్లో విక్రయాలు కొనసాగించారు.

పాత స్టాక్ పై తిరకాసు..

ప్రస్తుతం తగ్గించిన ధరలను మాత్రం ‘షాపుల్లో ఉన్న స్టాక్ అయిపోయాక’ అని తిరకాసు పెట్టడం విమర్శలకు తావిస్తున్నది. వైన్ షాప్ నిర్వాహకులకు ఇబ్బందులు పాత ఎమ్మార్పీ ఉన్న స్టాక్ ను అమ్మడం వైన్ షాపుల నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. తగ్గించిన ధరలు కొత్త స్టాక్ వచ్చాకే అని షరతు విధించడంతో నష్టపోతున్నారు. డిపో నుంచి కొత్తగా వచ్చిన మద్యాన్ని తక్కువ ధరకు, ఇప్పటికే ఉన్న స్టాక్ ను పాత ధరకు విక్రయించడం తలకు మించిన భారంగా మారిందని వాపోతున్నారు.

Advertisement

Next Story