ప్రజలారా.. దోపిడీ, అణిచివేతని బద్దలు కొడదాం : మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ లేఖ

by Vinod kumar |   ( Updated:2022-12-12 13:53:41.0  )
Maoist party
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: మావోయిస్టు పార్టీపై ప్రభుత్వాలు, పోలీసులు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని నమ్మవద్దు అంటూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ ఒక లేఖ విడుదల చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, కార్మికులు, కర్షకులు, యువత అందరూ మావోయిస్టు పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని, దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఈ లేఖలో పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేస్తున్నది దోచుకోవడం కాదా..? సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కాదా, నల్లమలలో యురేనియాన్ని విశాఖలో బాక్సైట్‌ని విదేశాలకు అమ్ముకుంటుంది మీరు కాదా..? ఆదివాసీల కోసం ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏంటి, దేశంలో ఎన్ని ఆదివాసి ప్రాంతాలను అభివృద్ధి చేశారో చెప్పగలరా అంటూ లేఖలో సూటి ప్రశ్నలు సంధించారు. అంతేగాక ఆదివాసీ ప్రజలతో ఓట్లు వేయించుకుని అవసరం తీరాక పక్కన పెడుతున్నది మీరు కాదా..? అని లేఖలో పేర్కొన్నారు.


మావోయిస్టు పార్టీ అభివృద్ధిని ఎక్కడ కూడా అడ్డుకోలేదని అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు చేసే దోపిడీని మాత్రమే అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పోలీసులు ఆదాయం లేకుండా జీతం తీసుకోకుండా ఒక్క రోజైనా ప్రజల కోసం పని చేశారా అలాంటి పోలీసులు ప్రజల కోసం మాట్లాడడం దెయ్యాలు వేదాలు వర్ణించడమే అవుతుంది అని హెద్దేవా చేశారు. పీఎల్‌జీఏ ప్రజలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆర్మీ అని ఆదివాసీలలో ఆత్మ ధైర్యాన్ని నింపడం కోసం పీఎల్‌జీఏ పని చేస్తుందని తెలిపారు. 22 సంవత్సరాల పీఎల్‌జీఏ లో వేల మంది కామ్రేడ్స్ అమరులయ్యారని, అనేక సంవత్సరాలుగా అసువులు బాసినటువంటి అమరులను స్మరించుకుంటూ పీఎల్‌జీఏ సంస్కరణ వారోత్సవాలను జరపమని పిలుపునివ్వడం తప్పెలా అవుతుందో పోలీసులు చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీపై శత్రువులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. పార్టీ ఎదుగుదల చూసి ప్రభుత్వాలు ఓర్వలేక చేస్తున్న నీతిమాలిన, సిగ్గు మాలిన పనిలో ఇది ఒక భాగం. ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ సైన్యం సిద్ధంగా ఉంది. ప్రజలారా దోపిడీ అనిచివేత ని బద్దలు కొడదాం.. ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం.. పీఎల్‌జీఏ వారోత్సవాలని జయప్రదం చేస్తూ ముందుకు సాగండి.. అంటూ కార్యదర్శి ఆజాద్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story