చీమలపాడు ఘటన దురదృష్టకరం.. అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు

by Hamsa |
చీమలపాడు ఘటన దురదృష్టకరం.. అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
X

దిశ, వైరా : కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అధైర్యపడవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ధైర్యం చెప్పారు. చీమలపాడు లో గురువారం అగ్ని ప్రమాద సంఘటన జరిగిన తర్వాత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేస్తానని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో కారేపల్లి మండలం గేటు రేలకాయపల్లి గ్రామానికి చెందిన ధర్మ సాత్ లక్ష్మణ్, స్టేషన్ చీమలపాడు గ్రామానికి చెందిన బానోత్ రమేష్, చీమలపాడు గ్రామానికి చెందిన అజ్మీరా మంగ్యా అలియాస్ మంగు మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే.

అయితే ఎమ్మెల్యే రాములు నాయక్ ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటన చేసిన మరునాడే అయిన గురువారం ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కారేపల్లి మండలంలోని గేటు రేల కాయల పల్లి, స్టేషన్ చీమలపాడు, చీమలపాడు గ్రామాల్లో తాతా మధు, రాములు నాయక్, తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ అధికారి లావుడ్యా జీవన్ లాల్ పర్యటించారు. మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఒక్కొ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున నగదును ఆర్థిక సహాయంగా అందచేశారు. ఈ సందర్భంగా తాత మధు, రాములు నాయక్ మాట్లాడుతూ చీమలపాడు లో అగ్ని ప్రమాద ఘటన జరగడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ ఘటన తమతో పాటు బీఆర్ఎస్ పార్టీను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీతో పాటు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని ప్రకటించారు. మృతుల పిల్లల విద్యాభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి జెడ్పిటిసి వాంకుడోత్ జగన్ నాయక్, చీమలపాడు సర్పంచ్ మాలోత్ కిషోర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్ద బోయిన ఉమా శంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story