- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt: జీపీవోల ఎంపికకు మార్గదర్శకాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామానికొక్క గ్రామ పాలన అధికారులను నియమించే ప్రక్రియ వేగవంతమైంది. 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ శనివారం జారీ చేశారు. ఇందులో పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలకు మాత్రమే గ్రామ పాలన అధికారులు(జీపీవో)గా ఎంపిక కానున్నారు. రీ డెప్లాయ్ కాబడిన వారిలో రెవెన్యూ పరిపాలన మీద అవగాహన, రిపోర్టులు రాయగల సమర్ధత కలిగిన వారిని మాత్రమే తీసుకోనున్నారు. ఈ క్రమంలో వారి నియామకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించారు. ఇతర శాఖలకు రీడెప్లాయ్ కాబడిన వీఆర్వోలు, వీఆర్ఏలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఆయా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐతే అప్లికేషన్ల స్వీకరణ, టెస్ట్ ల షెడ్యూల్ ని ప్రకటించలేదు. ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా సర్వీసు మ్యాటర్ తేల్చకుండానే విధి విధానాలు రూపొందించడం పట్ల అభ్యర్ధుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీపీవోల ఎంపిక గైడ్ లైన్స్
అర్హతలు: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. లేదంటే ఇంటర్మిడియేట్ తో పాటు ఐదేండ్ల అనుభవం ఉండాలి. రెగ్యులర్ సర్వీసులో వీఆర్ఏగా ఉండి ప్రస్తుతం రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ గా ఉండాలి.
బాధ్యతలు: గ్రామ పాలన అధికారుల విధులను కూడా జీవోలో పేర్కొన్నారు. అందులో ప్రధానంగా విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికేట్ల జారీ ప్రక్రియలో విచారించడం, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నీటి వనరుల కబ్జాలు కాకుండా జాగ్రత్త వహించడం, వాటిపై ఎంక్వయిరీ చేయడం, భూ సంబంధ అంశాల్లో ఇన్వెస్టిగేటింగ్ చేయాలి. ల్యాండ్ సర్వేలో సర్వేయర్లకు సహకరించాలి. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన లబ్దిదారుల గుర్తించడం, ప్రోటోకాల్ ఆఫీసర్లకు సహకరించాలి. విలేజ్, క్లస్టర్, మండల స్థాయి అధికారుల సమన్వయానికి సహకరించాలి. సీసీఎల్ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ అప్పగించిన అన్ని పనులను నిర్వర్తించాలి.
ఎంపిక ఎలా?
జీపీవో పోస్టుల అర్హతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పరీక్ష ద్వారా బాధ్యతలు, విధుల నిర్వహణకు అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్ ని లెక్కిస్తారు. ఎంపిక, జీపీవోల నియామకపు ప్రక్రియను సీసీఎల్ఏ నిర్వహిస్తారు. లేదంటే ఆయన ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే వారి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. నియామకపు ప్రక్రియ జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తారు. ఐతే ప్రస్తుత పే స్కేల్ ప్రకారమే వేతనాలు ఉంటాయి. పూర్వపు సర్వీసును పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.