హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధితో సీఎం బృందం భేటీ.. పలు రంగాల్లో భాగస్వామ్యం దిశగా చర్చలు

by Ramesh Goud |
హిరోషిమా ప్రభుత్వ ప్రతినిధితో సీఎం బృందం భేటీ.. పలు రంగాల్లో భాగస్వామ్యం దిశగా చర్చలు
X

దిశ, వెబ్ డెస్క్: జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం మంగళవారం హిరోషిమాను సందర్శించారు. ఈ సందర్భంగా హిరోషిమాలో పలు చోట్ల పర్యటించారు. అంతేగాక హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో హిరోషిమా స్థానిక ప్రభుత్వం -తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. పర్యావరణ సాంకేతికత, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించారు.

అలాగే పట్టణాభివృద్ధిలో భాగంగా విపత్తు నిరోధక నిర్మాణాలు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ పరిష్కారాల్లో హిరోషిమా అనుసరిస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని హైదరాబాద్‌లో ఉపయోగించే అవకాశాలపై చర్చలు జరిపారు. అంతేగాక తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ కేంద్రాల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో "హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ & మొబిలిటీ కారిడార్" ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధ్య విద్య, విజ్ఞాన మార్పిడి, సంయుక్త పరిశోధనలకు సహకారం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం బృందం అభిప్రాయపడింది.

ఇక శాంతి ఉద్యానవన అభివృద్ధి, బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలపై ఇరు రాష్ట్రాల మధ్య సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హిరోషిమా ప్రభుత్వం అందించిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, స్థిరత్వం, సాంకేతిక పురోగతిలో హిరోషిమా సాధించిన విజయాలను ప్రశంసించారు. శాంతి, సుస్థిరత కోసం ప్రపంచంతో సహకారానికి తెలంగాణ కట్టుబడి ఉంటుందని సీఎం ఉద్ఘాటించారు. ఈ భేటీపై మంత్రి శ్రీధర్ బాబు.. తెలంగాణ- హిరోషిమా మధ్య పలు రంగాల్లో సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించారు.



Next Story

Most Viewed