నల్ల పోచమ్మ ఆలయం వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..

by Sumithra |
నల్ల పోచమ్మ ఆలయం వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కరువు..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : భక్తుల కొంగుబంగారమైన శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఉగాది పండుగ జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండల కేంద్రంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతాయి ఉత్సవాలను తిలకించేందుకు మండల ప్రజలతో పాటు. ఎల్లారెడ్డి, లింగంపేట్, కామారెడ్డి, మెదక్, పాపన్నపేట్, హైదరాబాద్, వివిధ జిల్లాలు, ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రతి ఏటా జాతరకు వచ్చే భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నల్ల పోచమ్మ ఆలయానికి వచ్చే ఆదాయంతో జాతరకు వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయడంలో ఆలయ కమిటీ నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు అయిన తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో గోపాల్ పేట గ్రామ పరిసర ప్రాంతాల్లోని పోచారం ప్రధాన కాలువతో పాటు, చెరువు కుంటల్లోకి వెళ్లి స్నానాలు చేసి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు స్పందించి మరుగుదొడ్ల సౌకర్యం స్నానపు గదులు స్వచ్ఛమైన త్రాగు నీరు వసతి కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

ఆలయం ముందు ఖాళీ స్థలం వదలాలి..

ఉగాది పండుగ సందర్భంగా నల్ల పోచమ్మ ఆలయం జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు, అలాగే మహిళలకు ఆలయం ముందు ఖాళీ స్థలం లేకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు స్థలం సరిపోక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రథోత్సవం రోజు కూడా భక్తులు రథోత్సవాన్ని తిలకించేందుకు స్థలం సరిపోక ఇబ్బందులు ఎదురవుతాయని ఆలయ కమిటీ సభ్యులు స్పందించి ఆలయం ముందు వేసిన దుకాణాలను మరో చోటుకు మార్చాలని భక్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed