గుర్తింపు సంఘానికి గుర్తులేమా, జాతీయ సంఘాలకు అక్కరలేమా..!

by Mahesh |
గుర్తింపు సంఘానికి గుర్తులేమా, జాతీయ సంఘాలకు అక్కరలేమా..!
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ఒకప్పుడు సింగరేణి సంస్థలో ఎమ్మెల్యేలు, మంత్రులతో కాని పనులు యూనియన్లకు అయ్యేవి. కార్మికులకు యూనియన్‌లు అంటే అంత నమ్మకం ఉండేది. యూనియన్లు కూడా కార్మిక హక్కులకు అంతే నిబద్దతతో అధికారులతో పోరాడి సాధించేవారు. కానీ ప్రస్తుతం సింగరేణిలో ఆ సంస్కృతి లేదేమో అనిపిస్తుంది? కార్మికులకు కూడా యూనియన్ల పైన నమ్మకం సన్నగిల్లుతున్నట్టు కనబడుతుంది. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు గని, ఓపెన్ కాస్ట్‌లలో వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న కార్మికుల ఆవేదనను ఇటు గుర్తింపు సంఘం మర్చిపోయిందా? జాతీయ సంఘాలకు తమ జాడ కనబడత లేదా అని ఆవేదన చెందుతున్నారు.

ప్రమాద రహిత సింగరేణి కోసం తమపై ప్రయోగం చేస్తున్నారనిపించక మానదు. ప్రస్తుతం గాయపడిన కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూస్తే భవిష్యత్తులో గనిలో గాని ప్రమాదం జరిగితే మైన్ ఆక్సిడెంట్‌గా నమోదు చేసుకుంటే మీరు కూడా ఇదే బాధలు పడవలసి వస్తుందని తెలియజేసే ప్రయోగంగా తమను ఉపయోగిస్తున్నారని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. తమను ప్రయోగశాలలోని వస్తువులుగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారు ఆసుపత్రిలో పడుతున్న బాధలను వారి మంచి చెడు గురించి మాట్లాడే వారే లేరా? అని కార్మికుల కుటుంబ సభ్యులు ఆవేదన పడుతున్నారు.

వైద్యులు ప్రమాదం అంటున్నారు.. అధికారులు ఉండాలంటున్నారు

గతంలో క్షతగాత్రులకు శాస్త్ర చికిత్స చేసిన తర్వాత ఇంటికి పంపారు. ఇక్కడ ఉంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందన్నారు. గతంలో డిశ్చార్జ్ చేసి ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చి పీఎం ఈ అధికారికి చూపించుకుంటే మస్టర్ వేసే వారు. గతంలో ఎక్కడో ఏమో జరిగిందని సాకు చూపి రక్షణ చర్యలో భాగంగా హాస్పిటల్ లో ఉంచుతున్నామని చెబుతున్నారు. రక్షణ చర్యలు సరే కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే బాధ్యులు ఎవరని, భరించవలసింది కార్మికులే కదా, గుర్తింపు సంఘం అధికారులు మాటలు విన్నారు తప్ప కార్మికులకు ఎదురయ్యే సమస్యలను వివరించి ఒప్పించలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారులు కార్మికులను బెదిరింపు, లొంగ తీసుకునే భాగంగా వారి అవసరాలను ఆసరాగా తీసుకుని ఫిట్ తీసుకుంటే ఒక నెల సర్ఫేస్ ఉద్యోగం ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. మేము ఆరోగ్యవంతంగా ఉంటే ఫిట్ వాళ్లే ఇస్తారు కదా? మేమెందుకు అడుగుతాము అంటున్నారు కార్మికులు. ఇదేం పద్ధతి అని అడుగుతే మా చేతిలో ఏముంది అధికారుల ఆదేశాలు అంటున్నారు వైద్యులు. ఇక్కడ ఉంటే ఇన్ఫెక్షన్ పాలవడం నూటికి నూరుపాళ్ళు ఉందని కానీ రక్షణాధికారి చెప్పింది చేయాలి కదా అంటున్నారు వైద్యులు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్మికులను ఏ విధంగా మానసిక క్షోభకు గురవుతున్నారో.

పౌష్టికాహారం లేదు..

సింగరేణి ఆసుపత్రుల్లో గని ప్రమాదంలో గాయపడి అడ్మిట్ అయిన కార్మికులకు సరైన పౌష్టికాహారం, మందులు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి గ్లాసు పాలైన అందిస్తున్నారు. అది కూడా ఇక్కడ గతి లేదని ఆసుపత్రిలో పెట్టే ఆహారం తింటే ఎప్పటికీ కోలుకుంటామని కార్మికులు అంటున్నారు. వీరికి సంరక్షణ కోసం కుటుంబ సభ్యులు వస్తూపోతూ వడదెబ్బతో బాధపడిన వారు కూడా ఉన్నారు. వీరి చర్యల వల్ల కార్మికులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story