దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ : మంత్రి హరీష్ రావు

by Sridhar Babu |   ( Updated:2023-01-14 13:20:58.0  )
దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ : మంత్రి హరీష్ రావు
X

దిశ, ఇల్లందు : దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇల్లందు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ అధ్యక్షతన శనివారం ఇల్లందు మండలం బుజ్జాయిగూడెంలోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ లాంటిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలైన కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు బాగున్నాయని మోడీ ప్రభుత్వం కాపీ కొట్టి పేర్లు మార్చి ఆ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల అవార్డులు తెలంగాణకే దక్కాయన్నారు. కానీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ నేతలు అక్కసు వెలిబుచ్చుతున్నారని పేర్కొన్నారు. మోడీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణి పై కేంద్రం వాటా 49 శాతం అని, రాష్ట్రం వాట 51 శాతం అని అన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి లోని నాలుగు బొగ్గు బావులను ప్రైవేటుపరం చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతేనే సింగరేణి బతుకుతుందని పేర్కొన్నారు. మోడీ బీఎస్ఎన్ఎల్, రైల్వే లైన్, రైల్వే స్టేషన్లను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్న పరిపాలనను దేశంలోని ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించారని తెలిపారు. దేశం మొత్తం జనవరి 18న ఖమ్మంలో జరిగే సభ కోసం చూస్తుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీతో కలిసి వచ్చే పార్టీలన్నిటినీ కలుపుకొని బీజేపీని ఓడిస్తామన్నారు. తెలంగాణ నాయకులు రేపు జాతీయస్థాయిలో నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నాలుగు సంవత్సరాలు ఇల్లందును ఎంతో అద్భుతంగా తయారు చేశారన్నారు. ప్రతి గ్రామానికి ,ప్రతి పంచాయతీకి, తండాలకు, గూడాలకు రోడ్లు వేశారన్నారు. ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి రూ.25 కోట్లను కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. ఇల్లందు బస్సు డిపోను కేటీఆర్ చేతులమీదుగా ఫిబ్రవరి 10న ప్రారంభిస్తామన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేశారన్నారు. దేశంలో మోడీ పాలన బాగాలేదని ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని వివరించారు. ఖమ్మంలో జరిగే సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమవుతుందన్నారు. ఈ సభకి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. ఇల్లందు నియోజకవర్గం నుండి 50 వేల మందిని తరలించే బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మహబూబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఆగోతు బిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, డీఎస్ఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, ఉద్యమకారుడు ఉప్పలపాటి వెంకటరమణ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story