ప్రమాదంలో 12 మండలాల ప్రజలు.. వైరాలో కలకలం సృష్టిస్తోన్న వాటర్

by Disha Web Desk |
ప్రమాదంలో 12 మండలాల ప్రజలు.. వైరాలో కలకలం సృష్టిస్తోన్న వాటర్
X

దిశ, వైరా : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలోని 12 మండలాలకు కలుషితమైన రంగు నీరు సరఫరా అవుతున్నాయి. ఆకుపచ్చ రంగులో నల్లాల ద్వారా సరఫరా అవుతున్న ఈ నీటిని తాగలేమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండే వేసవిలో మిషన్ భగీరథ పథకం నుంచి స్వచ్ఛమైన మంచినీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఘోస పడుతున్నారు. వైరా రిజర్వాయర్ వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకం నుంచి ఖమ్మం జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 465 గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన మంచినీటి స్థానంలో ఆకుపచ్చ రంగులో కలుషిత నీరు సరఫరా అవుతుంది. ఈ నీరు దుర్వాసన కూడా వస్తుండటంతో ప్రజలు తాగేందుకు విముఖత చూపుతున్నారు.

వైరా రిజర్వాయర్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి చేరటంతో నీటి సరఫరాలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఎల్ అండ్ టి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వేసవి కాలంలో మిషన్ భగీరథ ద్వారా కలుషిత నీరు సరఫరా కావడంతో ప్రజలు మంచినీటి కోసం బోరు పంపులతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తుంది. గత మూడు రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ విషయమై ఎల్ అండ్ టి ఏఈ మణిశంకర్‌ను దిశ వివరణ కోరగా వైరా రిజర్వాయర్ నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరటంతో మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న మంచినీరు రంగుగా వస్తుందని చెప్పారు. మిషన్ భగీరథ పథకంలో క్లోరినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైరా రిజర్వాయర్ నీటి మట్టం 8.9 అడుగులు మాత్రమే ఉందని వివరించారు. ఎంత క్లోరినేషన్ చేసినప్పటికీ డెడ్ స్టోరేజీ సమస్య వల్ల నీటి రంగు మారటం లేదన్నారు. రంగు నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై భగీరథ అధికారులతో చర్చిస్తున్నారని వివరించారు.



Next Story

Most Viewed