తప్పుకోవడమా.. మరోదారి వెతుక్కోవడమా..?

by S Gopi |   ( Updated:2022-11-27 03:48:31.0  )
తప్పుకోవడమా.. మరోదారి వెతుక్కోవడమా..?
X

దిశ, చర్ల: ఉమ్మడి ఖమ్మం జిల్లా రసవత్తర రాజకీయాలకు వేదికైంది. తాజా మాజీల నడుమ సీట్ల పోరు కొనసాగుతోంది. ఈసారి సిట్టింగ్‌లకే సీట్లు అని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా మీడియా కథనాల నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యేలలో చాలా ధీమా కనిపిస్తుండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ల కోసం వెయిటింగ్ చేస్తున్న నాయకుల్లో ఆందోళన మొదలైంది. నిజంగా సిట్టింగ్‌లకే సీట్లు దక్కితే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని దాదాపు అరడజను మంది వెయిటింగ్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మిగతా చోట్లా సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించినా తమ స్థానానికి వచ్చే సరికి సీఎం కేసీఆర్ తమనే కరుణిస్తారనే కొండంత ఆశ ఒకవైపు, ఒకవేళ చివరి వరకు టికెట్ రాకపోతే పోటీ నుంచి తప్పుకోవడమా లేక మరోదారి వెతుక్కోవడమా అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు మరోవైపు ఆశావహులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహుల పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్లుగా కనిపిస్తోంది.

ఆశావహుల్లో అగ్రనేతలు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమౌతున్నవారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల పెద్ద నాయకులు ఉండటం గమనార్హం. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తన సత్తా చాటాలని తహతహలాడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరోమారు అదృష్టం పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య వంటి వారి పరిస్థితి ఏంటనేది అంతుచిక్కడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ నాయకులు ఆశిస్తున్న స్థానాల్లో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలే ఉన్నారు. గత ఎన్నికల్లో పాలేరు బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుని ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు, కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బానోతు హరిప్రియ ఈ నలుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌‌లో చేరారు. కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సిట్టింగ్‌లుగా తమ సీట్లు పదిలమని వీరు భావిస్తున్నారు.

2023 ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇందులో కొందరు పార్టీ టికెట్ ఇస్తే సరి, ఇవ్వకపోయినా పోటీ తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే టీఆర్ఎస్ టికెట్ రాకుంటే జనబలం కలిగిన వీరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతారా లేక రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కనిపించే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తారా అనేది ప్రస్తుతం తెలియడం లేదు. తమ మదిలో ఆలోచనలు ఏమాత్రం బయట పెట్టకుండా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూద్దాం అనే ధోరణిలో మౌనమే సమాధానంగా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే పోటీ ఖాయమని అనుచరులకు, అభిమానులకు సంకేతాలు ఇస్తున్నారు.‌ చివరి క్షణాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా వెన్నంటే నడిచేలా క్యాడర్‌ను ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే వర్గాలుగా ఫోకస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండల స్థాయిలో సైతం నాయకులు గ్రూపులు కట్టి వర్గాలుగా విడిపోయి పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

అసంతృప్తి నేతలకు ఆహ్వానం

వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో గ్యారంటీలేక కొంత అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎరవేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనాదరణ కలిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఈ రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అందినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ఇద్దరు నాయకులు పార్టీ వీడుతామన్నట్లు ఎక్కడా చెప్పడంలేదు. ఇబ్బందికర పరిస్థితులలో కూడా పార్టీలో సర్దుకుపోతున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని మనసులో బాధ ఉన్నా, అభిమానులు ఒత్తిడి చేస్తున్నా బయటపడకుండా సందర్భాన్ని బట్టి సొంత పార్టీ టీఆర్ఎస్‌ను సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. తొందర వద్దు మనకే మంచి రోజులు వస్తాయి, వేచిచూద్దాం అని అనుచరులకు సర్ది చెబుతున్నారు. తమ నేతల అంతరాంగం తెలియక అభిమానులు సతమతం అవుతున్నారు. నాయకులు ఏది చెబితే దానికే సై అంటున్నారు. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story