- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం

దిశ, వైరా: రైతు పోరాటాల ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా వ్యవసాయ రంగం సంక్షోభం వీడదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా 21వ మహాసభలను గురువారం వైరాలో కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించారు. మహాసభల ప్రారంభం సూచికంగా రైతు సంఘం పతాకాన్ని సీనియర్ నాయకులు బండారుపల్లి ముత్తయ్య ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపాన్ని భాగం హేమంతరావు ఆవిష్కరించగా ఫోటో ఎగ్జిబిషన్ను రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్ రెడ్డి ప్రారంభించారు. దొండపాటి రమేష్ పుచ్చకాయ వెంకటేశ్వర్లు ,జక్కుల రామారావు, బానోత్ రవి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భాగం హేమంతరావు మాట్లాడుతూ… గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారతదేశ వ్యవసాయ రంగం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు.
మోడీ పాలనలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు.18 శాతం జిడిపి గల వ్యవసాయం రంగంపై కార్పొరేటర్లు కన్ను పడిందని ఆరోపించారు. లాల్ బహదూర్ శాస్త్రి జై కిసాన్ జై జవాన్ నినాదం ఇస్తే ఇప్పటి పాలకులు జై అదానీ జై అంబాని అంటున్నారని విమర్శించారు. 766 మంది రైతులు బలిదానం తర్వాత నల్ల చట్టం అమలుపై వెనకడుగు వేసిన మోడీ దొడ్డి దారిన మరలా ఆ చట్టాన్ని అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటివరకు కేవలం 36% భూమికి మాత్రమే సాగునీరు అందిస్తున్నారని 64% భూమిలో సాగు వర్షాధారం ద్వారా జరుగుతుందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా బ్యాంకుల జాతీయకరణ జరిగిందని, అవే బ్యాంకులు ఇప్పుడు రైతులకు రుణాలు ఇవ్వకపోగా కార్పొరేటర్ల సేవలో మునిగితేలుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 16.5 లక్షలు కోట్ల రూపాయల కార్పొరేటర్ల రుణాలను రద్దు చేసిందని, రైతు రుణాల పట్ల ఈ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.
గిట్టుబాటు ధరలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సాగు గిట్టుబాటు కాక రైతులు అసంఘటిత కార్మికులు గా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదన్నారు. మోడీ అమలు చేస్తున్న పంటల బీమా వల్ల కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయన్నారు. మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలకు 62 వేల కోట్ల రూపాయల లాభాలు రాగా అంబానీ కంపెనీకి 11 వేల కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్నారు. ప్రపంచంలో ఆహార ఇతర ఉత్పత్తులకు సంబంధించి ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్న ఉత్పాదిక శాతాన్ని పరిశీలిస్తే మిగిలిన దేశాల కంటే తక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు గడిచిన వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందన్నారు. సిపిఐ పోరాట ఫలితంగా దుమ్ముగూడెం ప్రారంభమైతే ఇప్పుడు పేర్లు మార్చి తీవ్ర జాప్యం చేస్తున్నారని హేమంతరావు ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది తప్ప ప్రాజెక్టు పూర్తి కావడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ రైతు భరోసా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల ఆగ్రహానికి గురైన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదన్నారు. చైతన్యం కలిగిన తెలంగాణ రైతాంగం సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా, సిపిఐ రైతు సంఘం నాయకులు ఎర్రబాబు, మెడికంటి వెంకటరెడ్డి, జాగర్లమూడి రంజిత్, యామాల గోపాలరావు, ఏపూరి లతా దేవి సింగ్, నరసింహారావు, తోట రామాంజనేయులు, ఏపూరి రవీంద్రబాబు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బానోతు రామకోటి, అమర్, వీరభద్రం, ముందరపు రాణి, ఏలూరు భాస్కరరావు, భాగం ప్రసాద్, కూచిపూడి రవికుమార్, బెజవాడ రవి, పగడాల మల్లేష్, ఇటికల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.