Kapil sibal: ఈసీ ఒక విఫలమైన సంస్థ.. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్

by vinod kumar |
Kapil sibal: ఈసీ ఒక విఫలమైన సంస్థ.. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల సంఘం(EC) పై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil sibal) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ పనికి రాని, విఫలమైన సంస్థగా అభివర్ణించారు. ఎలక్షన్ కమిషన్ తన రాజ్యాంగ బాధ్యతలకు అనుగుణంగా పని చేయడం లేదని అందుకే చాలా మంది ప్రజలు దానిని విశ్వసించడం లేదని ఆరోపించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఎన్నికల సంఘంపై ఎంత త్వరగా నమ్మకాన్ని కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయన్నారు. ‘ఎన్నికల సంఘం ఒక నిష్క్రియాత్మక సంస్థ. కానీ ఆ సంఘం విధులను సరిగా నిర్వర్తించడం లేదు. ఈవీఎంలతో పాటు, ఎన్నికల ప్రక్రియలో కొన్ని సమస్యలున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టకపోతే ప్రజాస్వామ్య భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఆరోపించాయని, ఈవీఎంలతో పాటు, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలను సూచించే ఇతర తీవ్రమైన అంశాలపై కూడా ప్రతిపక్ష పార్టీలు దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని దీనిని గాను అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్, ఇండియా బ్లాక్ పార్టీలు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కపిల్ సిబల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు సైతం ఈసీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Next Story