KTR : ఆ మూడే బీఆర్ఎస్ ఓటమికి కారణం

by M.Rajitha |
KTR : ఆ మూడే బీఆర్ఎస్ ఓటమికి కారణం
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్‌(Karimnagar)లో జరిగిన బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొని ప్రసంగించారు. ఏప్రిల్ 27 న జరిగే వరంగల్ సభ(Warangal Meeting)కు లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి బీఆర్ఎస్ పని అయిపోయిందని మాట్లాడుతున్న సన్నాసుల నోళ్లు మూతలు పడేలా చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పేం లేదు.. కేసీఆర్(KCR) మీద ద్వేషం నింపి జనాల మనసు మార్చారని అన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం బీఆర్ఎస్ మళ్లీ గెలవడం చారిత్రక అవసరమన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని, కేసిఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ అని, ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతారని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17 2001 నాడు ఇదే కరీంనగర్‌లో ఎస్ఆర్ఆర్ మైదానంలో కేసీఆర్ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడుంది తెలంగాణ అని అప్పటి పీసీసీ అధ్యక్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే దానికి స్పందించి కేసీఆర్ రాజీనామా చేస్తే.. రెండు లక్షల ఓట్లతో గెలిపించి కరీంనగర్ దమ్ము చూపించిందని గుర్తు చేశారు. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తూ.. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో 15 నెలల నుంచి బీఆర్ఎస్ చూపిస్తోందని, కాలం బాలేనప్పుడు వానపాములు కూడా నాగుపాముల లెక్క బుసకొడతాయి. గ్రామ సింహాలు కూడా నిజమైన సినిమాల లెక్క గర్జిస్తాయన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే అని, రూ.15 లక్షలు జన్‌ధన్ ఖాతాల్లో వేస్తామని మోడీ మాట ఇచ్చి మోసం చేసిండని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 11 సంవత్సరాలలో చేసిందేమీ లేదన్నారు. తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణలో ఏ ఊరికి పోయినా రైతు కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని, ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే కాంగ్రెస్ వచ్చినంక బతుకు ఆగమైందంటున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం, అణిచివేతల రాజ్యం అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని, రిటైర్ అయి వేరే దేశానికి పోయినా తిరిగి రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తామని హెచ్చరించారు.

అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడే బీఆర్ఎస్ ఓటమికి కారణాలని, కేసీఆర్ మీద ద్వేషం నింపి జనాల మనసు మార్చారని మండిపడ్డారు. ఏప్రిల్ 27 తర్వాత మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీని కాపాడే వాళ్లకే పెద్ద పీట వేస్తామని, ప్రజల్లో ఉండకుండా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వాళ్లకు అవకాశం ఉండదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసాన్ని ఎండ కట్టాలని, తెలంగాణలోని అన్ని వర్గాలకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా చెప్పే సత్తా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవడానికి మేమంతా కష్టపడతామని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13కు 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలని దిశా నిర్దేశం చేశారు.

Next Story