వైరాలో నిబంధనలకు పాతర.. ముడుపుల జాతర

by Mahesh |
వైరాలో నిబంధనలకు పాతర.. ముడుపుల జాతర
X

దిశ, వైరా : సామాన్యుడి ఇంటికి విద్యుత్ మీటర్ మంజూరు చేయాలంటే సవాలక్ష కొర్రీలు పెట్టి తీవ్రంగా ఇబ్బందికి గురి చేసే విద్యుత్ శాఖ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కు విద్యుత్ లైన్ మంజూరు చేశారు. 2018వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ అనుమతి ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్తు లైన్ మంజూరు చేయడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు విమర్శలు వస్తున్నాయి. వైరా విద్యుత్ శాఖలోని ఓ అధికారి ముడుపుల జాతర కి నిబంధనలను పాతర వేశారని ఆ శాఖలోని సిబ్బంది చర్చించుకోవడం విశేషం. 2018 సంవత్సరంలోనే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో నిర్మాణం చేపట్టిన ఓ ఇంటికి నిబంధనలకు విరుద్ధంగా 250 మీటర్ల పైగా సర్వీస్ వైరుతో కేటగిరి 2 విద్యుత్ మీటర్ మంజూరు చేయడం విశేషం.

వెంచర్ వేసిన 5 సంవత్సరాల తర్వాత విద్యుత్ లైన్ మంజూరు..

వైరాలో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణపల్లి లో 203/ఏ /1, 203/సి సర్వే నెంబర్‌లో ఉన్న సుమారు 5 ఎకరాల్లో 2018 సంవత్సరంలో వైరా పట్టణం సోమవారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఆజాద్ వెంచర్ ను వేశారు. అయితే 2018 ఆగస్టు 2వ తేదీన వైరాను మున్సిపాలిటీగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్ లైన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్ల తర్వాత యజమాని చేసిన దరఖాస్తుతో కరెంట్ లైన్ ప్రతిపాదనలు స్థానిక అధికారులు తయారు చేయగా ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదన ఆమోదించారు. అయితే ప్రస్తుతం విద్యుత్ లైన్ మంజూరు చేయాలంటే తప్పనిసరిగా వెంచర్‌కు డిటిసిపి అనుమతి ఉండాలి.

కానీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా పాత పంచాయతీ అనుమతులతోనే విద్యుత్ లైన్లు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న ఓ అధికారి అన్నీ తానై విద్యుత్తు లైన్ మంజూరు చేయించారనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని బహిరంగంగానే ప్రచారం జరుగుతుంది. 2022 మార్చి నెలలో సదరు రియల్ వ్యాపారి దరఖాస్తుతో విద్యుత్తు లైన్ కోసం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపగా ఆ ప్రతిపాదన తిరస్కరించారు.

మరలా గత మార్చి నెలలో ఓ అధికారి 25 కే.వి ట్రాన్స్ఫారంతో 55 స్తంభాలతో పాటు ఇతర విద్యుత్ సామాగ్రికి ప్రతిపాదనను పంపగా 30వ తేదీన విద్యుత్తు లైనుకు ఉన్నతాధికారులు అనుమతులు ఇచ్చారు. 2018 లో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 250 మీటర్ల దూరం సర్వీస్ వైరు ఏర్పాటు చేసి ఇచ్చిన మీటర్ కలెక్షన్ ఆధారంగా ఈ విద్యుత్తు లైన్ అనుమతులు ఇవ్వటం విద్యుత్ శాఖ ను అబాసు పాలు చేస్తుంది. ఈ విషయం బహిర్గతం కావడంతో ఈ వ్యవహారంలో అన్ని తానే వ్యవహరించిన అధికారి విద్యుత్ లైన్ మంజూరు విషయం బయటకు ఎలా వచ్చిందని తన కింద సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేయటం విశేషం.

ఇప్పటికైనా ఎన్పీడీసీఎల్ సీఎండీతో పాటు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలను పంపిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వైరా డిఈ కృష్ణను దిశ వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ అనుమతితో వేసిన వెంచర్‌కు మున్సిపాలిటీలో ఎప్పుడైనా విద్యుత్ లైన్ మంజూరు చేయవచ్చని స్పష్టం చేశారు. వైరా ఏడి రామకృష్ణ ను వివరణ కోరగా గ్రామపంచాయతీ సమయంలో ఆ వెంచర్ కు మంజూరు చేసిన ఓ విద్యుత్ మీటర్ ఆధారంగా ప్రతిపాదనలు తయారు చేసి పంపామని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ మీటర్ నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిందే కదా అని ప్రశ్నించగా అది తన పరిధి కాదని అప్పట్లో మీటర్ మంజూరు చేసిన సిబ్బందిని, అధికారుల వివరణ తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed