వ్యర్థాలతో నిండిపోతున్న రాతోని చెరువు..

by Sumithra |
వ్యర్థాలతో నిండిపోతున్న రాతోని చెరువు..
X

దిశ, పెనబల్లి : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్య పథకాలు లక్ష్యాలను చేరుకోకుండానే విఫలం అవుతున్నాయి. గ్రామాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యనికి పెద్దపీట వేసి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఈ పథకాలను లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. పెనుబల్లి మండల కేంద్రానికి సమీపంలో, గౌరారం రెవెన్యూ పరిధిలో ఉన్న రాతోని చెరువుకి సమీపంలోని గ్రామాల నుండి అనేక రకాల వ్యర్ధాలను ఈ చెరువులో పడవేయడం వలన ఈ చెరువు పెద్ద డంపింగ్ యార్డ్ ల మారిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో, పారిశుద్ధ్య కార్యక్రమాలకు లక్షలు రూపాయలను వెచ్చించి ట్రాక్టర్లను, డంపింగ్ యార్డ్ లను, మల్టీ పర్పస్ వర్కర్స్ ని ఏర్పాటు చేసింది. అయితే డంపింగ్ యార్డ్ కు చేరవల్సినటువంటి చెత్తాచెదారం, వ్యర్ధాలు, కాలువగట్లపైన, చెరువు శిఖాలలో, హైవే రోడ్ల పక్కకు చేరుతున్నాయి. పారిశుద్ధ్య పథకాల అమలులో ప్రజలను భాగస్వాములు చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు ప్రజలకు వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయడం పై అవగాహన కానీ, దీని వలన ప్రజలకు కలిగే అనారోగ్య సమస్యల పై అవగాహన కల్పించడంలో కానీ పూర్తిగా విఫలమవుతున్నారు. గ్రామాలలో వ్యర్ధాలను వేయడానికి ప్రజలకు అందుబాటులో కుండీలను ఏర్పాటు చేయడం లేదు. దీనితో ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వ్యర్ధాలను వేస్తున్నారు. ఈ వ్యర్ధాలను తీసివేయడానికి ప్రతిరోజు ట్రాక్టర్లను గ్రామంలోని ప్రతి బజారుకు పంపడం లేదు. కొన్ని గ్రామపంచాయతీలలో అయితే అసలు ట్రాక్టర్లను వ్యర్థాలను ఎత్తి వేయడానికి రావడం లేదని, జమా ఖర్చులు మాత్రం రాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

రాతోని చెరువు పై ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో, సమీప గ్రామాలలోని ప్రజలు వ్యర్ధాలను తీసుకుని వచ్చి చెరువులో పడవేస్తున్నారు. కనీసం 10 రోజులకు ఒకసారి కూడా అధికారులు చెరువును పర్యవేక్షించకపోవడంతో, రోజురోజుకు చెరువులో వేసే వ్యర్ధాలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. రాతోని చెరువులో గుట్టలుగా వ్యర్ధాలు పెరిగిపోయినా గాని ఇరిగేషన్ అధికారుల కళ్ళకు మాత్రం కనిపించడం లేదు. ఈ పనులను చెరువులో చెత్త, వ్యర్థాలను పడవేయకుండా కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా అధికారులకు రావడం లేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద ఈ రాతోని చెరువుకు 1.35 కోట్ల రూపాయలతో పూడికపనులు తీసి చెరువును మరమ్మతులు చేశారు. కానీ సమీప గ్రామ ప్రజలు ఈ చెత్తాచెదారాలు వేయడం వల్ల చెరువులో నీరు కలుషితం అవడమే కాకుండా మళ్లీ పూడిక పేరుకు పోతుంది. ఇకనైనా పంచాయతీరాజ్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ స్పందించి రాతోని చెరువు సమీపంలోని గ్రామ ప్రజలు వ్యర్ధాలు చెరువులో వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యర్ధాలు వేసే ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, ఒకరిద్దరి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, మళ్ళీ ఇటువంటి పరిస్థితుల పునరావతం కాకుండా ఉంటాయని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story