ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేయాలి.. మంత్రి తుమ్మల

by Sumithra |
ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేయాలి.. మంత్రి తుమ్మల
X

దిశ బ్యూరో, ఖమ్మం : వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందరికీ దక్కేలా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రఘునాథపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమీక్షలో మంత్రి రెవెన్యూ, విద్యుత్, వ్యవసాయం, విద్య, పంచాయతీ రాజ్, వైద్యం, ఇర్రిగేషన్, ఆర్ అండ్ బి, స్త్రీ - శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, పశు సంవర్థక, ఎక్సైజ్, తదితర శాఖల పై సమీక్ష నిర్వహించారు. ధరణిలో 250 పెండింగ్ ఫైళ్లు ఉన్నాయని, వారంలోగా అన్ని ఫైళ్లను పరిష్కరించాలన్నారు.

పోడు భూముల సమస్యలు రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. మండలంలో ఎన్ని ఇండ్ల పట్టాలు ఇచ్చినది, ఎంతమంది ఇండ్లు కట్టుకున్నది, ఎంతమంది ఇతరులకు అమ్మినది పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. చెరువు శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ కు సంబంధించి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ అప్ గ్రేడ్ చర్యలు చేపట్టి, విద్యుత్ సరఫరా నాణ్యతతో చేయాలన్నారు. మండలంలో విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా వున్నట్లు, లాభదాయక వ్యవసాయం పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలో రూ. 55 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అన్ని అంగన్వాడీలకు మిషన్ భగీరథ నీరు, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని మంత్రి తెలిపారు.

అన్ని గ్రామాల్లోని ఓహెచ్ఎస్ఆర్ లకు మిషన్ భగీరథ నీటి సరఫరా అందేలా చూడాలని, క్లోరినేషన్ ప్రక్రియ క్రమం తప్పకుండా చేయాలని ఆయన తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం క్రింద ఎన్ని యూనిట్లు ఇచ్చినది, ఆ యూనిట్లతో గొర్రెలు ఎంత పెరిగింది నివేదిక సమర్పించాలన్నారు. శాఖలు చేపట్టుతున్న పనులు, పనుల పురోగతి, ఎంతకాలంలో పనులు పూర్తయ్యేది సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో రఘునాధపాలెం ఎంపీపీ భూక్యా గౌరీ, జెడ్పీటీసీ మాలోతు ప్రియాంక, ఆర్ అండ్ బీఎస్ఇ హేమలత, జిల్లా ఉద్యానవన అధికారి వెంకటరమణ, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, ఎఫ్ఆర్ఓ రాధిక, సీడీపీఓ కవిత, వైద్యాధికారి డా. బాలకృష్ణ, ఐటీడీఎ డీఇ రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed