Minister Thummala : రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి..

by Aamani |
Minister Thummala : రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి..
X

దిశ, ఖమ్మం : సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్ శ్రీరామ్ నగర్, నెంబర్-10 నందు టియుఎఫ్ ఐడీసి నిధులు ఒక కోటి 75 లక్షలతో చేపట్టిన సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో ఉండాలని, పద్ధతి ప్రకారం, లైన్, లెవెల్, అందంగా, నీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లేలా సరిగ్గా ఉండాలని అన్నారు. రోడ్డు వెడల్పు వర్క్ ఆర్డర్ ప్రకారం చేపట్టాలని, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. డ్రెయిన్ల పై షాపులు, ఆక్రమణలు చేపట్టవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు.

నదుల్లో ఇండ్ల నిర్మాణాలు, కాల్వల ఆక్రమణ, చెరువు అలుగుల ఆక్రమణలతో ప్రజలకు కష్టాలు వచ్చాయని, మున్నేరు వరదలకు కారణం ఇదేనని అన్నారు. చేసే పని పది కాలాల పాటు అందరికి ఉపయోగపడేలా ఉండాలని మంత్రి అన్నారు. ఖాళీ ప్లాట్ల పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. పరిశుభ్రత ఉంటే రోగాల బారిన పడరని, ఆరోగ్యంగా ఉంటే పిల్లలు బాగా చదివి అభివృద్ధి చెందుతారని, పరిశుభ్రత పాటించడం ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇంచార్జ్ నగరపాలక సంస్థ కమిషనర్ డా. పి. శ్రీజ, 18వ డివిజన్ కార్పొరేటర్ మందడపు లక్ష్మి మనోహర్, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, మేడారపు వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, మున్సిపల్ ఇఇ కృష్ణ లాల్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed