Minister Ponguleti Srinivas Reddy : వైద్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి

by Aamani |
Minister Ponguleti Srinivas Reddy : వైద్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి
X

దిశ, ములకలపల్లి: మండలంలోని మంగపేట గ్రామంలో రూ. 1.56కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా మంత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని అన్ని గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పంచాయతీరాజ్ అధికారులతో చేయవలసిన భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా వైద్య శాఖ అధికారితో మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కావలసిన పరికరాలు మందులు సిబ్బంది తదితర అవసరాలకు సంబంధించి నివేదికలు కలెక్టర్ కు అందజేయాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులతో మాట్లాడుతూ వైద్యులు దేవుడితో సమానం అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని, పల్లె ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఆశయంతో పక్కా భవనాలు నిర్మించడంతో పాటూ వైద్య సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వైద్యులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మళ్లీ పరిశీలనకు వస్తానన్నారు.

కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పుల్లారావు, అటవీ క్షేత్ర అధికారి రవి కిరణ్, ఎంపీఓ లక్ష్మయ్య వైద్యశాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed