ఆంధ్రా నుంచి భారీగా ధాన్యం అక్రమ రవాణా

by Sridhar Babu |
ఆంధ్రా నుంచి భారీగా ధాన్యం అక్రమ రవాణా
X

దిశ,నేలకొండపల్లి : తెలంగాణలో ధాన్యానికి బోనస్ ఇస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని పలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. గత ఇరవై రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఆదివారం ధాన్యం లారీలను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. నేలకొండపల్లి, ముదిగొండ మండలాల నుంచి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని మిల్లులకు ధాన్యం తరలిస్తుండగా అడ్డుకున్నారు. తెలంగాణలో సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తుండటంతో ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఏపీలోని మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, తెనాలి నుంచి దళారులు లారీల ద్వారా సన్న రకం ధాన్యాన్ని తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు పెద్దసంఖ్యలో లారీలు వస్తుండడంతో అనుమానించిన స్థానికులు లారీలను అడ్డుకున్నారు. ఏపీకి జిల్లాలోని పలు ప్రాంతాలు సరిహద్దుగా ఉండడంతో ముదిగొండ మండలంలోని వల్లభి, నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి చెక్ పోస్టు మీదుగా నల్గొండ జిల్లాకు భారీగా ధాన్యాన్ని లారీల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో లారీలో సుమారు 350 నుంచి 400 క్వింటాళ్ల ధాన్యం రవాణా చేస్తుండగా ఒక్క లారీకి బోనస్ కింద రూ.2 లక్షల వరకు వస్తుంది. ఇక్కడ ధాన్యం అమ్మేందుకు స్థానిక రైతుల వివరాలు సమర్పించాల్సి ఉండడంతో ఏపీ దళారులు స్థానిక అధికారులు, లేదా కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సాయం తీసుకుని వారికి కొంత ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు తప్పించుకునేందుకే ముదిగొండ మండలంలోని వల్లభి, నేలకొండపల్లి మీదుగా కోదాడకు ధాన్యం తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ లు చెబుతున్నారు.

Advertisement

Next Story