గద్దరన్నది అర్ధశతాబ్దపు పోరాటం : హరీష్ రావు

by Kalyani |
గద్దరన్నది అర్ధశతాబ్దపు పోరాటం : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఐదు దశాబ్దాలలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం లోని విపంచి కళానిలయం లో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న సాహిత్యం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు... అణిచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభుత్వ అవార్డులకు అర్థం లేదు అనే మాట గద్దర్ చెప్పారు.. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను మాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రభుత్వ అవార్డును తిరస్కరించిన నందిని సిద్ధారెడ్డి సిద్దిపేట బిడ్డ కావడం గర్వకారణం అన్నారు. పదవుల కోసం ఆశ పడకుండా తన తండ్రి పోరాటాన్ని, చరిత్రను రేపటి భావితరానికి అందించడానికి మంచి ప్రయత్నాన్ని తీసుకున్నారని కొనియాడారు.

ఐదు దశాబ్దాలలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరన్న ఉన్నాడని అన్నారు. విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమాల్లో గద్దర్ న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించాడని అన్నారు.మలిదశ ఉద్యమంలో గద్దర్ అన్నను కలిసే అదృష్టం కలిగింది అన్నారు. 100 ఉపన్యాసాల సారం గద్దరన్న ఒక్క పాట అన్నారు. చాలా సామాన్య పదాలతో ప్రజల హృదయాలల్లోకి చేరే విధంగా గద్దరన్న పాటలు ఉంటాయని కొనియాడారు. గద్దరన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట ఉన్న అన్ని రోజులు గద్దరన్న సజీవంగానే ఉంటాడని అన్నారు. పొడుస్తున్న పొద్దుమీద పాట తెలంగాణ ఉద్యమాన్ని, సమాజాన్ని ఉర్రూతలూగించి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది అన్నారు.

2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎంపీలపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అభ్యర్థులను పెట్టాలని నిర్ణయిస్తే అది తప్పని వాదించిన వ్యక్తి గద్దర్ అని తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ కి కూడా గద్దర్ అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. తూప్రాన్ లో నీళ్లు లేవు హల్దీ వాగులో నుంచి వాటిక చెరువు కి లిఫ్ట్ పెట్టాలని గద్దర్ కోరితే..8 నెలల్లో పూర్తి చేసి ఆయన తోనే ప్రారంభోత్సవం జరుపుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాల అమలు కావడం లేదని గద్దర్ లెటర్ రాస్తే పాటి సీఎం కేసీఆర్ వారికీ జీతాలు పెంచినట్లు తెలిపారు.. గద్దరన్న జీవిత చరిత్ర పైన డాక్యుమెంటరీ చేయాలని అందుకు సహకారం అందిస్తా అన్నారు. అసమానతలు పోవాలంటే గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణకు గర్వకారణం..

గద్దర్ తెలంగాణ గడ్డ మీద పుట్టడం తెలంగాణకు గర్వకారణమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తర్వాత స్థానం గద్దర్ దే అన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి

ఉమ్మడి మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలని మాను కొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గద్దర్ ఆట పాట కళాకారుల వెల కట్ట లేనివి అని ఆయన రాసిన పాటలు ప్రజల ఆస్తి అన్నారు.

ప్రపంచ సాహిత్యంలో గద్దర్ దీ ప్రత్యేక స్థానం

ప్రపంచ సాహిత్యంలో గద్దర్ దీ ప్రత్యేక స్థానం అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దాంతాన్ని పాటగా మలచిన కవి గద్దర్ అని కొనియాడారు. గద్దర్ పాట లేని గ్రామం లేదన్నారు.

గద్దర్ అనితర సాధ్యుడు

గద్దర్ తన పాట ద్వారా వేల మందిని ఆకట్టుకున్న అనితర సాధ్యుడు అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జీవీ సూర్య కిరణ్, ప్రతినిధులు తిరుపతి రెడ్డి, సిద్దెంకి యాదగిరి, రంగాచారి, శ్రీహరి యాదవ్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed