భూసేకరణ నిలిపివేయాలి

by Sridhar Babu |
భూసేకరణ నిలిపివేయాలి
X

దిశ, కూసుమంచి : ఎస్సారెస్పీ స్టేజీ -2 భూ సేకరణ నిలిపివేయాలని బుధవారం రైతులు ఆందోళన చేశారు. కూసుమంచి మండలం చౌటపల్లిలో భూములను పరిశీలించడానికి వచ్చిన అధికారులను కలిసి రైతులు మొర పెట్టుకున్నారు. ల్యాండ్ అక్విజేషన్ డీఈ సంజీవ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 14 సంవత్సరాల కిందటే ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కాల్వల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఇప్పుడు భక్తరామదాసు ప్రాజెక్టుతో భూములు సస్యశ్యామలంగా మారాయని, ఇంకా కాల్వలు ఎందుకని రైతులు ప్రశ్నించారు. మరికొద్ది రోజుల్లో సీతారామ ప్రాజెక్టుతో గోదావరి జలాలు వస్తున్న క్రమంలో ఈ కాల్వతో లాభం లేదన్నారు. రైతులు భూములు కోల్పోవడం తప్పితే ప్రయోజనం లేదన్నారు. చౌటపల్లి , బచ్చోడు, బీరోలు చెరువులకు పాలేరు రిజర్వాయర్ నుంచి నీరు వస్తుందన్నారు. ఇప్పటికే సాగుకు నీరు పుష్కలంగా ఉందన్నారు.

నీరు ఎక్కువై పొలాలు ఊట బారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత భూముల పక్కనే వాగు ఉందని ఇన్ని జలవనరులు ఉన్న తర్వాత కూడా ఎస్సారెస్పీ స్టేజీ -2 భూ సేకరణ చేయడంతో భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. గతంలో వరంగల్ లో ఎస్పారెస్పీ అధికారులు, ఖమ్మం కలెక్టర్ కు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని, నీరు పుష్కలంగా ఉందని, భూమిని ఇచ్చేది లేదని చెప్పారు. ఎస్సారెస్పీ కాల్వలతో రెండు పంటలు పండే సారవంతమైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరం, రెండెకరాల్లోపు వ్యవసాయ భూములు కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న తాము వీధిపాలవుతామని పేర్కొన్నారు. భూమి పోతే ఎలా బతకాలని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని భూసేకరణను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి, బంధంపల్లి, బీరోలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story