- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kammam: అక్రమార్కుడికి అధికారుల అండ..! తోగ్గూడెంలో మళ్లీ తోడేస్తున్నారు!
తోగ్గూడెం క్వారీల్లో అక్రమార్కులు మళ్లీ తోడేస్తున్నారు. లారీలు వెళ్లకుండా ఆఫీసర్లు కందకాలు తవ్వినా.. మూడు రోజులకే మళ్లీ కార్యకలాపాలు స్టార్ట్ చేశారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంకర తరలిస్తున్నారు. ఈ తతంగాన్ని ‘దిశ’ వెలికితీసి.. క్వారీలకు వెళ్లి వీడియో చిత్రీకరించగా.. విలేకరులపై నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో సాగుతున్న ఈ మైనింగ్ కు అధికారులు, రాజకీయ నాయకుల అండాదండ పుష్కలంగా ఉంటున్నది. దీంతో నిర్వాహకుడికి ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు స్థానికులు, మీడియా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
దిశ, ఖమ్మం బ్యూరో: పర్యావరణానికి ప్రమాదంగా, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన అక్రమాలకు నిలయమైన పాల్వంచ మండలంలోని తోగ్గూడెం క్వారీలో మళ్లీ మైనింగ్ స్టార్ట్ అయింది. మూతపడ్డ మడు రోజులకే మళ్లీ రీ ఓపెన్ అయింది. నిర్వాహకుడికి అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతోనే ఇది సాధ్యమైంది. తోగ్గూడెంలో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా, ప్రభుత్వ, ఫారెస్ట్, రెవెన్యూ భూముల్లో మైనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ విషయంలోనూ ఎలాంటి సమాచారం ఇవ్వని అధికారులు.. క్వారీ నిర్వాహకుడికి మాత్రం పూర్తి సహకారమందిస్తున్నారు. అంతా అక్రమమేనని ఓవైపు చెబుతూనే.. చర్యలు తీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. క్వారీ వెనుక బడాబాబుల హస్తం ఉందంటూనే.. వారితో తాము పెట్టుకోలేమని, అనవసర వివాదాల్లోకి తామను లాగి, ఉద్యోగాలు పోగొట్టుకోలేమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని శాఖల అధికారులకు తెలిసినా..
తోగ్గూడెం క్వారీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నదనే విషయం అన్ని శాఖల అధికారులకూ తెలుసు. అనుమతుల విషయం పక్కన పెడితే దాదాపు 9 క్వారీల్లో అనధికారికంగా మైనింగ్ జరుగుతుందన్న విషయం స్పష్టం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కట్టకపోవడంతో ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. పెనాల్టీతో సహా ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉందని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీ కట్టి, తిరిగి రెన్యువల్ చేయించుకున్నారా అంటే మైనింగ్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తొమ్మిది క్వారీలన్నింటికీ అనుమతులున్నాయా అంటే.. కోర్టుకు వెళ్లారని మాత్రమే ఆన్సర్ ఇస్తున్నారు తప్ప.. ఏ విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో క్వారీ నిర్వాహకుడు ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులే కాకుండా రాజకీయ నాయకుల అండదండలు ఉండటం.. అవసరమైతే రాష్ట్రస్థాయిలో మేనేజ్ చేసుకునే వెసులుబాటు ఉందని నిర్వాహకుడే బాహాటంగా చెబుతుండడం గమనార్హం.
అనుమతులు ఒకరివి.. నిర్వహణ మరొకరిది..
- పాల్వంచ మండలం తోగ్గూడెం పరిధిలోని సర్వే నెంబర్ 42, 43లో సీహెచ్ నాగమ్మ, భర్త: సుబ్బయ్య లీజ్ తీసుకున్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. గుంటూరు జిల్లా రూరల్ మండలం నల్లపొండి గ్రామానికి చెందిన ఈమెకు లీజు ఎలా ఇచ్చారన్నది అనుమానమే. అంతేకాదు ఈ లీజుదారు పేరిట రూ.35 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందిగా అధికారిక రికార్డుల్లో ఉంది.
- దుమ్ముగూడెం మండలం పేరాయిగూడేనికి చెందిన వగ్గే వెంకటేశ్వరరావు, తండ్రి: చిన్నబ్బి లీజుదారు పేరిట 20 సర్వే నంబర్ లో మైనింగ్ కు అనుమతిచ్చారు. అయితే ఈ లీజుదారు కూడా రూ. 35 కోట్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నట్లు తెలుస్తుంది.
- లూనావత్ కిషన్, తండ్రి సాంబయ్యకు సర్వే నంబర్ 29, 30లో మైనింగ్ అనుమతులిచ్చినా.. రూ. 15 కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. వీరితో పాటు.. బానోత్ రామయ్య, సీహెచ్ నాగమ్మ, బోడా చిట్టిబాబు, శెట్టిపల్లి నర్సింహా, సోడె సతీష్, ఇస్లావత్ రాజు మొత్తం 9 క్వారీల పేరిట అక్షరాల ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ రూ. 300 కోట్లుగా ఉన్నది. అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఆ క్వారీలను లీజుదారులు ఎవ్వరు నిర్వహించడం లేదని తెలుస్తున్నది. అంగబలం, అర్ధబలం ఉన్న వ్యక్తుల చేతుల్లోకిఆ క్వారీలు వెళ్లడం, అధికారులు, రాజకీయ నాయకులు వారికి సహకరిస్తుండడం గమనార్హం.
కందకాలు తవ్వినా..
తోగ్గూడెం క్వారీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నదని చెప్పిన అధికారులు లారీల రాకపోకలు నిషేధిస్తూ రోడ్లకు అడ్డంగా కందకాలు తవ్వారు. ఇది జరిగిన మూడు రోజులకే అర్ధరాత్రుళ్లు లారీలు యథేచ్ఛగా తిరగడం ప్రారంభించాయి. అయితే కందకాలు ఎందుకు తవ్వినట్లు? కంకర తరలించడానికి అనుమతులు ఎందుకు ఇచ్చినట్లు? అన్న వాటికి అధికారులే సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకుల అండదండల కారణంగా మైనింగ్ తిరిగి ప్రారంభమైతే ఆ విషయమన్నా స్పష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరిగి మైనింగ్ జరుగుతుందన్న విషయాన్ని స్థానికులు ‘దిశ’కు తెలియజేశారు. దీంతో ‘దిశ’ విలేకరులు క్వారీలకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలు సేకరించారు. రెండు, మూడు ముఠాలను తప్పించుకుని క్వారీ పనులు జరుగుతున్న తీరును ధైర్యంగా వీడియోలో చిత్రికరించారు. అప్పటికే గమనించిన కొందరు.. ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమవగా.. చాకచక్యంగా తప్పించుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఫోన్లలో బెదిరింపులు..
క్వారీలోకి విలేకరులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న నిర్వాహకుడు స్థానిక విలేకరికి ఫోన్ చేసి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నా అనుమతి లేకుండా క్వారీలకు ఎందుకు వచ్చావురా.. నిన్ను క్వారీలోనే బొందపెడతా’ అని హెచ్చరించాడు. రాయడానికి వీలు లేని భాషలో తీవ్రంగా దుర్భాషలాడుతూ.. తనకు రాజకీయ అండ ఉన్నదని, అధికారులు కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరని చాలెంజ్ విసిరాడు. క్వారీ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, స్థానిక విలేకరులు కొందరు త్వరలో రాష్ట్రస్థాయిలో మైనింగ్ అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.