ఖమ్మం జిల్లా పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం

by samatah |   ( Updated:2023-02-15 07:05:45.0  )
ఖమ్మం జిల్లా పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం
X

దిశ, వైరా : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. 2018 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతికూల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం చావు తప్పి కన్నులొట్ట పోయిన చందంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. మిగిలిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు కాంగ్రెస్, రెండు టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరిగింది.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ తో టీడీపీ జతకట్టడంతో సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గత ఎన్నికల్లో తన శక్తికి మించి కేసీఆర్ వైసీపీ గెలుపు కోసం జగన్ కు అన్ని విధాల సహకరించారు. అక్కడ గెలిచిన జగన్ ప్రతి సందర్భంలో ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు.ఈ టార్గెట్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయటాన్ని గతంలో మధిర‌లో జరిగిన వనభోజనాల్లో ఓ కౌన్సిలర్ బహిరంగంగా విమర్శలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ సఖ్యత గానే ఉన్నారు.

తమ వర్గాన్ని నిత్యం అవమానిస్తున్న జగన్ కు గత ఎన్నికల్లో సహకరించడంతో పాటు ప్రస్తుతం ఆయనతో సీఎం కేసీఆర్ మంచి సంబంధాలు కొనసాగించడం ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ఆ వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. ఈ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అసంతృప్తిగానే ఉన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ సామాజిక వర్గం రాజకీయంగా కేంద్ర బిందువుగా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆ సామాజిక వర్గం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమ్మం, వైరా నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గంలోని అత్యధిక మంది బీఆర్ఎస్ ను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి రాజకీయ పరిణామాల్లో వచ్చే ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు కీలకమై అవకాశం లేకపోలేదు.

పొంగులేటికి మద్దతుపై కూడా అనేక సందేహాలు..

ఇటీవల బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కూడా ఆ సామాజిక వర్గం మద్దతు తెలిపే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన తర్వాత పొంగులేటి పలు సార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో ఆ సామాజిక వర్గాన్ని తన వైపు ఆకర్షించేందుకు ఎన్టీఆర్ ను కీర్తిస్తున్నారు. అయితే జగన్‌తో పొంగులేటికి ఉన్న సంబంధాలు జిల్లాలోని ఆ సామాజిక వర్గాన్ని డైలమాలో పడేస్తున్నాయి. జిల్లాలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ను వ్యతిరేకిస్తున్న ఆ సామాజిక వర్గంలోని వారు పొంగులేటి వైపు పూర్తిస్థాయిలో వెళ్లేందుకు ఊగిసలాడుతున్నారు.

ఈ ఎన్నికల్లో తాము పొంగులేటికి సహకరించినా....భవిష్యత్తులో జగన్ ప్రభావంతో ఆయన తమ వర్గంపై చిన్నచూపు చూస్తారేమో అని ఆ సామాజిక వర్గంలోని వారికి అనే అనుమానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ సామాజిక వర్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ గా బదిలీ కావడంతో జిల్లాలో కాంగ్రెస్ 6 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుందని రాజకీయం విశ్లేషకుల అభిప్రాయం. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో పార్టీల పొత్తులపై కూడా ఆ సామాజిక వర్గ ఓట్లు ఎటువైపు వెళ్తాయని అంశం ఆధారపడి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. మిగిలిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ఏ పార్టీతో పెట్టుకుంటాయో నేటికీ ఓ స్పష్టత రాలేదు. ఈ రెండు పార్టీలలో టీడీపీ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీకి ఆ సామాజిక వర్గాల ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ పార్టీ టీడీపీ‌తో పొత్తు పెట్టుకుంటే ఆ సామాజిక వర్గాల ఓట్లు రాజకీయాలకు అతీతంగా బీజేపీ, టీడీపీ వర్గానికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి సహకరించాలంటే ఇక్కడ ఆ సామాజిక వర్గం తమ పట్టును ఓట్ల రూపంలో నిరూపించాల్సిన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతుందో వేచి చూడాల్సిందే

ఇవి కూడా చదవండి : కొండగట్టుకి చేరుకున్న సీఎం కేసీఆర్

Advertisement

Next Story

Most Viewed