భూపతిరాయుని చెరువులో అక్రమ తవ్వకాలు..

by Sumithra |
భూపతిరాయుని చెరువులో అక్రమ తవ్వకాలు..
X

దిశ, కారేపల్లి : మండలంలోని పెద్ద చెరువుగా చెప్పబడే గాదెపాడు భూపతిరాయుని చెరువులో మట్టి అక్రమతవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా రైల్వే కాంట్రాక్టర్ ఇప్పటికే ఆరు వేల ట్రాక్టర్లకు పైగా మట్టిని తరలించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్, సైడింగ్ లైన్ నిర్మాణం, గాంధీపురం రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు రహదారి నిర్మాణానికి రైల్వే కాంట్రాక్టర్ పనులు చేపట్టారు. భూపతిరాయుని చెరువులో పది నుంచి 15 అడుగుల లోతు, 50 అడుగుల వెడల్పుతో ఎనిమిది చోట్ల భారీ తవ్వకాలను చేపట్టి అక్రమంగా మట్టిని తరలించారు. కిలోమీటర్ దూరం 20 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తుతో ఆరు వేల ట్రాక్టర్ల చెరువు మట్టితో నిర్మాణం పూర్తి చేశారు. 20 ట్రాక్టర్లు, మూడు జేసీబీలతో భూపతిరాయుని చెరువులో నెలరోజుల నుంచీ నిరంతరాయంగా మట్టిని తరలించారు.

అధికారుల అండదండలతోనే...

భూపతిరాయుని చెరువులో అక్రమతవ్వకాలు ఐబీ, రెవెన్యూ అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వుండే భూపతిరాయుని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో చేతులు మారాయో స్పష్టమవుతోంది. అడ్డుకట్ట వేయాల్సిన వ్యవస్థలు మొద్దునిద్రతో నిద్రపోతుంటే దగా యథేచ్ఛగా దండుకుంటుంది. అధికారులు భారీగా ముడుపులందుకుని ఈ మట్టి దందాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేద, మధ్య తరగతి వారు చిన్నపాటి ఇల్లు కట్టుకోవటాని మట్టితోలుకుంటే అనుమతుళ్ళేవని చర్యలు తీసుకునే అధికారులు భూపతిరాయుని చెరువు మట్టి దందా పై ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ముత్యాలగూడెం బోడును తవ్వేస్తున్నారు...

ఈ రైల్వే కాంట్రాక్టర్లు భూపతిరాయుని చెరువులో మట్టి కోసం బావులు తీయడమే కాకుండా ముత్యాలగూడెం సమీపంలోని ఓ బోడును కూడా అక్రమంగా తోడేస్తున్నారు.

చెరువులో తవ్వకాలు నా దృష్టికి రాలేదు (ఐబీ డీఈ వెంకన్న)

భూపతిరాయుని చెరువులో మట్టి తవ్వకాలు నా దృష్టికి రాలేదు. ఐబీ శాఖ నుంచి ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. విచారణ జరిపి చర్య తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed