Vaira MLA : సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తే రైతులకు ఒళ్ళు పులకరిస్తుంది...

by Sumithra |
Vaira MLA : సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తే రైతులకు ఒళ్ళు పులకరిస్తుంది...
X

దిశ, ఏన్కూరు : నీటి వసతులు ఉన్న వ్యవసాయ రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రమైన ఏన్కూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గో ద్రెజ్ కంపెనీ ద్వారా ఆయిల్ ఫామ్ పంటల పై నియోజకవర్గంలోని రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ విద్యార్థులు వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపుతున్నారని ఈ రంగంలో అత్యధిక ఆదాయం వస్తుందని రైతే రాజు.. రైతు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రత్యా మ్నాయ.. వాణిజ్య పంటల విస్తీర్ణం పై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతుల పట్ల ప్రగతికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంటను సాగు చేస్తున్న రైతులందరికీ లబ్ధి చేకూరనున్నదని ఆయన అన్నారు.

ఆయిల్ ఫామ్ పంట ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందని ఆయన తెలిపారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందని సుమారు లక్ష రూపాయలు వరకు ఆదాయం వస్తుంది అన్నారు. ఆయిల్ ఫామ్ పంటలో మూడు సంవత్సరాలు పాటు ఇతర అంతర పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. నాగార్జున సాగర్ కాలువ నీళ్లు ఆంధ్రకి వెళ్లడంతో మన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు కాలువను తీసుకు వచ్చారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం 132 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల కాళ్ళకు పాదాభివందనాలు చేస్తున్నానని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జూలూరుపాడు, ఏనుకూరు, వైరా మండలాల్లోని రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ సంవత్సరం ఈ ప్రాంతానికి గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఇవ్వాలని రాకపోతే, రైతుల పక్షాన నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోనని ఆయన అన్నారు. ఈ సంస్థకు తనవంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రైతులందరూ ఎక్కువగా వాణిజ్య పంటల వైపే మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గోద్రెజ్ కంపెనీ వారికి ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. పాస్ బుక్కులు లేని రైతులందరికీ పామాయిల్ మొక్కలు ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రతి రైతు మండల తహశీల్దార్ దగ్గర సర్టిఫికెట్ తీసుకువచ్చిన వెంటనే కంపెనీ వారు మొక్కలను పంపిణీ చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని వైరా, కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు ఈ మండలాలకు చెందిన రైతులను గోద్రెజ్ కంపెనీ ప్రోత్సహించాలని ఆయన అన్నారు. రైతులకు కంపెనీ ద్వారా ఇచ్చే మొక్కలు ఒకవేళ పనికి రాకుండా పోతే వాటి స్థానంలో రైతులకు కొత్త మొక్కలు ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్షణ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు ఎంటీఎస్ ను అమలు చేయాలని, పదవి విరమణ చేసే ఉద్యోగులకు 10 లక్షల రూపాయల బెన్ ఫిట్ ను, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సమగ్ర శిక్షణ ఉద్యోగులు కోరారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది.. చావా వెంకటేశ్వరరావు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుందని గోద్రెజ్ కంపెనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చావా వెంకటేశ్వరరావు అన్నారు. పామాయిల్ లక్ష మొక్కలను రైతుల సాగుకు పంపిణీ చేయడం లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కంపెనీ ద్వారా మధ్యవర్తి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఉంటుందని అన్నారు. గత 30 సంవత్సరాలుగా 65 వేల ఎకరాల్లో పామాయిల్ సాగును రైతులు చేస్తారని అన్నారు. ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల మొక్కలను పెంచడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్వీటి ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ, ఉద్యానవన శాఖ వైరా అధికారి వేణు, ఏన్కూరు వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, ఎంపీటీసీలు లచ్చిరాము నాయక్, చీరాల కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ భూక్యా లాలూ నాయక్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, ముక్తి వెంకటేశ్వర్లు, గుగులోతు శోభ నాయక్, కట్ట సత్యనారాయణ, ఎంట్రాతి శ్రీను, మాదినేని లెనిన్, రోహిత్ సాయి, పంతగాని నరేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story