ఖమ్మంలో హైడ్రా.. ప్రభుత్వం కసరత్తు..?

by Nagam Mallesh |
ఖమ్మంలో హైడ్రా.. ప్రభుత్వం కసరత్తు..?
X

దిశ బ్యూరో, ఖమ్మంః ఇప్పుడు తెలంగాణలో హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. తెల్లారేసరికి అక్రమ నిర్మాణాలు నేలమట్టం అవుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కొలనులు, నాలాల రక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను జిల్లాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు అనేకం కబ్జాకు గురైనట్లు పూర్తి సమాచారం ఉండటం, జిల్లాకు చెందిన మంత్రులు సైతం ప్రత్యేక సెల్ ఏర్పాటుపై పరిశీలన చేస్తామంటూ చెప్పడంతో అక్రమార్కులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైడ్రా విషయంలో ఫలితాలు బాగుండటంతో జిల్లాలో కూడా ఈ రకమైన వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఖమ్మం జిల్లాలో అనేక కబ్జాలు..

బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములు, చెరువులు అనేకం కబ్జాకు గురయ్యాయనే విషయం తెలిసిందే. అనేక చెరువులు నామ రూపాల్లేకుండా పోయి రియల్ వెంచర్లు దర్శనం ఇస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకుల అండదండలతో బినామీలు వెంచర్లు ఏర్పాటు చేయడం ఒకవిషయమైతే.. సొంతంగా స్థలాలను ఆక్రమించుకుని భవంతులు నిర్మించుకున్నారు. ప్రభుత్వ భూముల దగ్గర్లో రైతుల నుంచి ఎకరా, అరెకరం కొనుగోలు చేసి మిగతా ప్రభుత్వభూమిని ఎకరాల కొద్ది ఆక్రమించుకుని దొంగ కాగితాలు ప్రిపేర్ చేశారు. ఆ కాగితాలతో తమకు అనుకూలంగా అన్ని అనుమతులు పొంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వందల ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమి ఈ విధంగా అక్రమార్కుల చెరలో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన జిల్లా మంత్రులు హైడ్రా విషయంలో త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

సుడా.. మున్సిపల్ కార్పొరేషన్ లో..

ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని రియల్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవననిర్మాణాల్లో అక్రమార్కులకు వంతపాడిన అధికారులు అనేకం సుడా, మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో ఇప్పటికీ ఉన్నారు. ‘డబ్బు కొట్టు.. అనుమతులు పట్టు’ అనే రీతిలో వీరి అక్రమాలు ఆ రోజుల్లో జోరుగా సాగాయి. ఇప్పటికీ అనేక మంది మున్సిపల్ కార్పొరేషన్ లో తిష్ట వేసి అక్రమాలకు సహకరిస్తుంటారనే ఆరోపణలు లేకపోలేదు. నాడు సుడా చైర్మన్ గా పనిచేసిన బచ్చు విజయ్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా అధికార పార్టీ నాయకులు చర్యలు తీసుకోకుండా వెనుకడుగువేయడంతో రియల్ వ్యాపారులు అనేకమంది బాహాటంగానే ఫిర్యాదులు చేశారు. తమ వద్ద లక్షల రూపాయలు తీసుకుని అనుమతులు ఇస్తానని, ఆలస్యం చేస్తున్నాడని, మాట్లాడుకున్న దానికంటే అదనంగా అడుగుతున్నాడని ఆరోపించారు. కొన్ని అనుమతులు రహస్యంగా జరిగినా.. మరికొన్ని రాద్ధాంతం కావడంతో బహిర్గతమయ్యాయి. అదేవిధంగా కార్పొరేషన్ లో కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అనేక అక్రమాలకు పాల్పతున్నట్లు చర్చ జరుగుతుంది.

నాడు హ్యాపీ.. నేడు అన్ హ్యాపీ..

ప్రభుత్వ భూములు కబ్జా చేసి విక్రయించినవారు, బిల్డింగ్లు నిర్మించుకున్నవారు, చెరువులు, శిఖం భూములు, నాలాలు ఆక్రమించుకుని నిర్మించుకున్నావారు వివిధ కారణాలతో నాడు హ్యాపీగా ఉన్నా.. హైడ్రా కారణంగా నేడు వారి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో లాగే జిల్లాలో కూడా హైడ్రా ఏర్పాటు చేస్తే అనేక అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఈ ఉచ్చులో నాటి అధికార పార్టీ నాయకులు అనేకమంది చిక్కుతారనే చర్చ జరుగుతుంది. వీరితో పాటు రియల్ వ్యాపారులు, అనుచరులు, ఇరుక్కుంటారనే టాక్ లేకపోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఓ లెక్క.. కాంగ్రెస్ హయాంలో మరోలెక్కగా అభివర్ణిస్తూ..ముందుముందు ఆక్రమణదారులకు గడ్డుకాలం తప్పేట్లులేదనే చర్చ సాగుతుంది.

ఫ్రీహ్యాండ్ తో దూకుడు..

హైదరాబాద్ లో హైడ్రాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీహ్యాండ్ ఇవ్వడంతో కమిషనర్ రంగనాథ్ సిబ్బందితో కలిసి దూకుడు పెంచాడు. జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయతలపెట్టిన వింగ్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టి, స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ఎవరి ప్రోద్బలం లేకుండా స్వతంత్రంగా పనిచేసుకునే అవకాశం కల్పించడంతో, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తే అనేక ఆక్రమణ విషయాలు బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఖమ్మం నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో భూములకు విపరీత డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురయ్యయాని వాటి విడుదలతో అటు ప్రభుత్వానికి, జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు, ఇటు పార్టీకి మరింత మైలేజీ వస్తుందన్న చర్చ సాగుతుంది.

Advertisement

Next Story