"వయ్యారి భామ" ఆగడాలకు అంతులేకుండా పోయింది..

by Sumithra |
వయ్యారి భామ ఆగడాలకు అంతులేకుండా పోయింది..
X

దిశ, ఖమ్మం : ఖమ్మంలో వయ్యారి భామ ఆగడాలకు అంతులేకుండా పోయిందని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఉద్దేశిస్తూ హాట్ కామెంట్ చేశారు. సోమవారం ఖమ్మం నగరంలో ఉదయం 46, 47, 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తుమ్మల పాల్గొని ప్రసంగించారు. "వయ్యారి బామ" ఖమ్మం అభివృద్ధి నేను చేశానని చెప్పడం సిగ్గుగా లేదా అని విమర్శించారు. త్రీ టౌన్ ప్రాంతంలో గోల్లపాడు చానెల్ కు నా హయాంలో రూ. 70 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తే దాన్ని రూ. 170 కోట్లకు అంచనాలు పెంచుకుని వంద కోట్ల రూపాయల అవినీతికి ఎవరు పాల్పడ్డారని ప్రశ్నించారు. గొల్లపాడు ఛానల్ పనులలో ఎవరి వాటా ఎంతో త్వరలోనే బయటకు వస్తుందని హెచ్చరించారు. బొక్కలగడ్డ ప్రాంతం పేద ప్రజలు నివసించే ప్రాంతమని సంవత్సరానికి ఒకసారి వచ్చే మున్నేరు వరదలు వల్ల అస్థి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని అన్నారు.

మంత్రి మాత్రం ఓట్ల రాజకీయం కోసం ఎన్నికల నోటిఫికేషన్ కి ఒక్కరోజు ముందు హడావిడిగా శంకుస్థాన చేసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల రక్షణ కోసం ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న మున్నేరు కరకట్ట నిర్మాణాన్ని నేను గెలిచిన నెలరోజుల్లోనే నిర్మాణ పనులను ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఇచ్చో, బెదిరించో నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలే నీకు సరైన బుద్ది చెబుతారని, నన్ను రాజకీయంగా ఎదుర్కునే దమ్ములేక సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అడ్డంకులు తొలగించి అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గా ప్రసాద్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్, యర్రం బాల గంగాధర్ తిలక్, బాణాల లక్ష్మన్, బొజెడ్ల సత్యనారాయణ, షేక్ రజ్జి, నాలం సతీశ్, ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed