ప్రతిపల్లెకు రహదారి సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పువ్వాడ

by Sumithra |
ప్రతిపల్లెకు రహదారి సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పువ్వాడ
X

దిశ, కామేపల్లి : ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో కలిసి రూ.16.24 కోట్లతో చేపట్టనున్న పలుపనులను ప్రారంభించి, పలుపనులకు శంకుస్థాపనలు చేశారు. కామేపల్లి మండలం రాయగూడెం గ్రామంలో రూ.3 కోట్లతో రాయగూడెం నుండి రుక్కితండా మీదుగా బండిపాడు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బర్లగూడెం గ్రామం నుండి కొత్తతండా రోడ్డు వరకు రూ.1.05కోట్లతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామం కోయచెలక నుండి కమలాపురం రోడ్డు వరకు రూ.60లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

కామేపల్లి మండలం నెమలిపురి నుండి నెమలిపురి తండా వరకు రూ.49లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డును ప్రారంభించారు. పింజరమడుగు గ్రామం పింజరామడుగు నుండి నెమలిపురి వరకు రూ.2.10కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరిచంద్రపురం గ్రామంలో శ్రీరాంనగర్ తండాకు వెళ్లేందుకు రూ.1.75కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. మర్రిగూడెం గ్రామం మరిగూడెం నుండి కెప్టెన్ బంజారా వరకు రూ.3.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పాతలింగాల గ్రామం జాస్తిపల్లి నుంచి పాతలింగాల వరకు రూ.3కోట్లతో నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కోతలింగాల గ్రామం ఖమ్మం-ఇల్లందు రోడ్డు నుండి జాస్తిపల్లి వరకు రూ.1.15 కోట్లతో చేపట్టిన బీటీ రెన్యూవల్ పైలాన్ ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిపువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అభివృధ్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని, ముఖ్యంగా ప్రజలకు అవసరం అయ్యే మౌలిక సదుపాయాల పై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కోసం కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులే తమపనితీరుకు నిదర్శమని వారు పేర్కొన్నారు.

ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారి సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన కర్తవ్యమని మంత్రి అన్నారు. రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, కాల్వల నిర్మాణం వంటి అనేక పనులను చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఆర్డీఓ రవీంద్రనాథ్, కామేపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి.హనుమంతరావు, ఎంపీపీ బి.సునిత, కామేపల్లి మండలం రైతుబంధు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ అంతోటి అచ్చయ్య, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story