వైరా టీఆర్ఎస్‌లో ముసలం.. 'ఆ ముగ్గురి'పై యుద్ధానికి సర్వం సిద్ధం

by Disha News Desk |
వైరా టీఆర్ఎస్‌లో ముసలం.. ఆ ముగ్గురిపై యుద్ధానికి సర్వం సిద్ధం
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: వైరా మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్నించేందుకు అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లతో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మొత్తం 16 మంది తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారందరూ శుక్రవారం రహస్యంగా భేటి అయ్యారు. దిశ మీడియాలో 'అవినీతికి కేరాఫ్ వైరా మున్సిపాలిటీ.. అక్కడ ఆ ముగ్గురిదే పెత్తనం..' పేరిట పబ్లిష్ అయిన కథనం వైరా మున్సిపాలిటీతో పాటు నియోజకర్గంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మేరకు అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లందరూ ఒక్కతాటిపై నిలబడి ఆ ముగ్గురి అవినీతి బాగోతాలను ఎండగట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తాము కూడా పాలకవర్గం అయినందున ఏ విషయం అయినా తమకు తెలిసి జరగాల్సిందేనని.. ఈ విషయంలో పట్టు వదిలేదే లేదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

'దిశ'కు ప్రశంసలు..

అసంతృప్త కౌన్సిలర్ల భేటిలో ఇప్పటి వరకు మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలను అవసరమైతే ఆధారాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రహస్య భేటిలో దిశ కథనాలు చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. 'దిశ' రాసినవన్నీ అక్షర సత్యాలేనని, దమ్మున్న వార్తలను అందిస్తున్న 'దిశ'ను వారందరూ ప్రశంసించినట్లుగా కూడా తెలుస్తోంది. వైరా మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ బాగోతం.. సెల్ఫ్ అసెస్మెంట్‌లో జరిగిన అవినీతి, అక్రమ బిల్లుల వ్యవహారం, తెలిసిన వారికే కాంట్రాక్టులు ఇవ్వడం.. ఇలా అక్రమాలన్నీ జిల్లా కలెక్టర్‌తో పాటు పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు వారందరూ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story