అవినీతి ‘స్వామి’..బయట పడుతున్న బదిలీ అయిన కమిషనర్ లీలలు

by samatah |   ( Updated:2023-02-28 02:48:42.0  )
అవినీతి ‘స్వామి’..బయట పడుతున్న బదిలీ అయిన కమిషనర్ లీలలు
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో గతంలో కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. వైరాలో ఏడాదికాలం పనిచేసిన ఆ కమిషనర్‌పై ‘అవినీతి స్వామి’గా ముద్రపడింది. ఆ సంవత్సర కాలంలో మున్సిపాలిటీలో అన్నీతానై అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో చేపట్టిన ప్రతి పని మొదలుకొని ఖాళీస్థలానికి సెల్ఫ్ అసెస్మెంట్లు చేసి ఇంటి నంబర్లు ఇచ్చేవరకు ఆ కమిషనర్ అన్నీతానై వ్యవహరించారు. ఆ అధికారి పనిచేసిన సమయంలోనే గ్రామపంచాయతీ పేరుపై ఫోర్జరీ ఇంటి అనుమతుల ధ్రువీకరణ పత్రాలతో అనేక భవనాలు నిర్మితమయ్యాయి. అంతేకాకుండా అప్పట్లో ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడి ద్వారా అవినీతి అక్రమాలకు తెరలేపారని విమర్శలు ఉన్నాయి. ఇటీవల మున్సిపాలిటీ కౌన్సిలర్లు వైరా మున్సిపాలిటీ‌లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ ‘అవినీతి స్వామి’ వ్యవహారం వైరాలో తీవ్ర చర్చనీయాంసమైంది.

అన్నీతానై అక్రమాలకు తెర..

వైరా మున్సిపాలిటీలో అన్నీతానై సదరు అధికారి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో వైరాలోని ఖాళీ స్థలాలకు సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నంబర్లు మంజూరు చేశారని సమాచారం. మున్సిపాలిటీలో నిబంధనల ప్రకారం సెల్ఫ్ అసెస్మెంట్ పనులను రెవెన్యూశాఖ అధికారులు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు అధికారి స్వయంగా సెల్ఫ్ అసెస్మెంట్ పనులను చేపట్టారు. ఈ వ్యవహారంలో ఓ ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగి కీలకపాత్ర పోషించారు. ఇదే సమయంలో అనుమతులు లేకుండా అనేక భవన నిర్మాణాలు చేపట్టారు. కరోన వ్యాప్తి జరుగుతున్న సమయంలో మున్సిపాలిటీ నుంచి పారిశుధ్య పనులతో పాటు ఇతర కారణాలు చూపి అందిన కాడికి నిధులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. బ్లీచింగ్, ఫాగింగ్‌తో పాటు ఇతర పనుల పేరుతో నిధులు స్వాహా జరిగిందని వైరాలో ప్రచారం జరుగుతుంది. ఆయన హయాంలో వరదల వల్ల వైరాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సమయంలో పునరావాస కేంద్రంలో ఉండే వారికి కావాల్సిన సామగ్రితో పాటు భోజనాల ఏర్పాటు పేరుతో విచ్చలవిడిగా నిధులు విడుదల చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పునరాస కేంద్రాల కోసం కొనుగోలు చేసిన సామగ్రి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో గోరంత పనులకు కొండంత నిధులను గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేశారని సమాచారం. ప్రధానంగా డీటీసీపీ అనుమతి లేకుండా అప్పట్లో అనేక రియల్ ఎస్టేట్ వెంచర్ల ఏర్పాటును సదరు అధికారి ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సదరు అధికారి మున్సిపాలిటీలోని వాహనాలకు డీజిల్ పోయించే విషయంలో అక్రమాలకు పాల్పడిన విషయం అప్పట్లోనే బహిర్గతమైనది. ప్రైవేట్ వాహనాలకు డీజిల్ పోయించడంతో పాటు, మున్సిపాలిటీ వాహనాలకు ఖర్చైన డీజిల్ కంటే ఎక్కువ చూపించి బిల్లులు చేసుకున్నారని అప్పట్లో బహిర్గతమైంది. ఆయన అనంతరం వచ్చిన ఓ కమిషనర్ మున్సిపాలిటీలో డీజిల్ వ్యవహారంలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టారు. వీటితోపాటు అప్పట్లో పనిచేసిన ఆ అధికారిపై ఇతర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్‌కు కౌన్సిలర్లు ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి చేసిన అవినీతి అక్రమాలు మరోసారి చర్చకు దారి తీశాయి. కలెక్టర్ వైరా మున్సిపాలిటీలో స్పష్టమైన విచారణ చేపడితే సదరు అధికారి అవినీతి అక్రమాలు పూర్తిస్థాయిలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

Also Read...

మంత్రి VS అసంతృప్త నేతలు.. అధికార పార్టీలో భగ్గుమన్న విబేధాలు

Advertisement

Next Story

Most Viewed