ఖమ్మంలో బీజేపీ నాయకుల అరెస్ట్..

by Sumithra |
ఖమ్మంలో బీజేపీ నాయకుల అరెస్ట్..
X

దిశ, ఖమ్మం సిటీ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ని అర్ధరాత్రి అక్రమంగా, అన్యాయంగా కారణం లేకుండా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నాయకులు ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. కాగా ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలకు నిరసన తెలియజేయనీయకుండా ఖమ్మంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రప్రదీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరంతరం పోరాడుతున్న బీజేపీని బండిసంజయ్ ని చూసి ఓర్వలేక భయపడి ఆయన్ని అరెస్ట్ చేశారన్నారు.

టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రాల లీక్ కు, అదేవిధంగా టెన్త్ పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీక్ కు కారణమైన ఈ రాష్ట్రప్రభుత్వాన్ని, మంత్రులైన కేటీఆర్ ను, ఎమ్మెల్యేలను నిలదీస్తున్న బండిసంజయ్ ని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాక, ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కావాలని అక్రమంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన, నిరంకుశత్వ పాలనను బొంద పెట్టడం ఖాయమని బీజేపీ నాయకులు అన్నారు. రానున్నది బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, బీజేపీ రాష్ట్ర నాయకులు మట్టా దుర్గాప్రసాద్ రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకులు దాసరి శివ, బీజేపీ నాయకులు ఊరుకొండ ఖాదర్ లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed