జిల్లాలోని సిట్టింగులు పదిలమేనా..!

by Mahesh |
జిల్లాలోని సిట్టింగులు పదిలమేనా..!
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు స్థానాలను మినహాయిస్తే మిగతా 8 నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇందులో ఏడుగురు ఇతర పార్టీల నుంచి గెలిచి కారెక్కిన వారు కాగా.. ఒక్కరు మాత్రమే బీఆర్ఎస్ నుంచి గెలిచారు. మొత్తంగా కొందరి పనితీరు సక్రమంగా లేదని, కొందరి పనితీరు బాగుందని రిపోర్టులు సీఎం కేసీఆర్‌కు అందడంతో పనితీరు బాగాలేనివారిని తీవ్రంగా మందలించినట్లు ప్రచారం జరుగుతుంది.

వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా..?

ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న 8మంది ఎమ్మెల్యేల్లో ఎవరికివారే వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. కచ్చితంగా సీటు మాకే దక్కుతుందన్న ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు మినహా మిగతా వారు పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇలాంటి ఫిటింగ్ ఏంట్రా బాబూ అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మరో కొందరు మాత్రం ఎన్నికల సమయం వరకు సీఎం గడువు ఇచ్చారు కదా.. చూద్దాం అప్పటి వరకు అంటూ నిష్టూరమాడుతుంటే.. మరికొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలవైపు కన్నేస్తున్నారని సమాచారం.

అనవసరంగా వచ్చామా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ తప్ప.. మిగతావారంతా ఇతర పార్టీల్లో గెలిచి అధికార పార్టీలో చేరినవారే. పార్టీలో చేరినప్పుడు సీఎం ఇచ్చిన హామీలు ఇప్పుడు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఇస్తామన్న హామీ తమకు వచ్చిందని, ఆ క్రమంలోనే పార్టీలో చేరామని, ఇప్పుడు ఇలాంటి ఫిట్టింగ్ పెడ్డటం ఏంటని దగ్గరి వారితో వాపోతున్నారట. గెలిచిన పార్టీకి అన్యాయం చేసి, ఓటర్ల మనోభావాలకు విలువ ఇవ్వకుండా పార్టీ మారడం అంతా తమ కర్మ అనుకుంటున్నారట. ఏది ఏమైనా మూడు నెలల సమయం ఉన్నదని, ఈ సమయంలోనే ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలకు దగ్గరగా ఉందామని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని నిట్టూరుస్తున్నారు.

కన్ఫామ్ అయ్యేదాక నో గ్యారంటీ..

ముఖ్యమంత్రి మాటలతో కంగుతిన్న కొందరు జిల్లా ఎమ్మెల్యేలు లోలోపల ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. టికెట్లు ఎవరికి దక్కుతాయన్న విషయం ఇప్పుడే ఎవరూ చెప్పలేరని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ మదిలో ఏముందో అంత తొందరగా బయటపడదని, టికెట్లు వచ్చేదాకా నో గ్యారెంటీ అనుకుంటున్నారట. కేవలం ఒకరిద్దరు మాత్రమే వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండేది నేనే అని ప్రకటిస్తున్నా.. మిగతావారు మాత్రం ఆ సాహసం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికివారు ధీమాగా ఉన్నా.. సీఎం కేసీఆర్ తో కొందరు, మంత్రి కేటీఆర్ తో మరికొందరి సాన్నిత్యం చివరికి ఎటు దారితీస్తుందన్న ఆందోళన కూడా నెలకొంది.

నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు..

జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా మరో ఇద్దరు, ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం సైతం పొత్తులో భాగంగా తమకే సీటు వస్తుందని ప్రచారం మొదలు పెట్టి, అధికార పార్టీ అభ్యర్థిని నైరాశ్యంలో మునిగేలా చేస్తున్నారు. మరికొందరైతే మరో ముందడుగు వేసి ప్రచార రథాలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎన్నికల సమయం నాటిదాకా వేచి చూడటం ఎందుకని ముందుగానే సిద్ధం చేసుకుని ప్రజల్లో తిరగడం గమనార్హం.

వారి సంగతేంటి?

గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన వారి సంగతేంటనే ప్రశ్న మళ్లీ తెరమీదకు వచ్చింది. పోయిన ఎన్నికల్లో ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు అనూహ్యంగా అధికార పార్టీలో చేరారు. ఓటమి చెందిన అభ్యర్థులు సైతం అదే పార్టీలో ఉంటూ, అదే నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రం ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని, నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉన్న ప్రజలకు కావాల్సిన పనులు మాత్రం చేసి పెడుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉన్నా.. సిట్టింగులు, మాజీల మధ్య వైరం కూడా అంతే స్థాయిలో ఉంది. ఎవరికివారు సీట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నా ఫలితం ఏంటనేది మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం చేతిలోనే ఉంది.

Advertisement

Next Story