potholes : రోడ్లన్నీ గుంతలు...పూడ్చేది ఎప్పుడు...

by Sridhar Babu |
potholes : రోడ్లన్నీ గుంతలు...పూడ్చేది ఎప్పుడు...
X

దిశ, కూసుమంచి : మండలంలోని పాలేరు, నరసింహులగూడెం నుంచి ఎర్రగడ్డ తండా, కొత్తూరు వరకు రహదారి గుంతలుపడి ప్రమాదకరంగా మారింది. అడుగున్న లోతున గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఇందుకు నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్టర్లు ఒక కారణమైతే,ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదలు మరో కారణం. రెండు సంవత్సరాల క్రితం కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం నుంచి తల్లంపాడు వరకు 18 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పనులు జరిగాయి. దాంతో టిప్పర్ల ద్వారా అధిక లోడుతో మట్టి తోలడగంతో రోడ్లపై గుంతలు పడ్డాయి. ప్రధానంగా ఎర్రగడ్డ తండా, కొత్తూరు ప్రాంతాల నుంచి నరసింహుల గూడెం, పాలేరు గ్రామాల రహదారుల మీదుగా నేషనల్ హైవేకి ఈ మట్టి తోలడంతో రహదారులు దెబ్బతిన్నాయి.

దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో మరింత ప్రమాదకరంగా మారాయి. నరసింహులగూడెం, కొత్తూరు వెళ్లే రహదారి సమీపంలో చాప్తా కుంగిపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది. జాతీయ రహదారి పనులు ముగిసిన వెంటనే లింక్ రోడ్ల మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అధికారులు, గుత్తేదారులు అడ్రస్ లేకుండా పోయారు.

ఈ రహదారుల వెంట అత్యవసర సేవలైన 108 ,104 తో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రయాణించాలంటే నరకం చూస్తున్నారు. అనేకమార్లు ఈ రహదారుల గుంతల్లో వాహనాలు ఆగిపోయి తీవ్ర ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులు ఈ ప్రాంతాల రహదారులను యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రహదారులను బాగు చేయాలని పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed