6 గ్యారెంటీలన్నీ 420 పథకాలే

by Sridhar Babu |
6 గ్యారెంటీలన్నీ  420 పథకాలే
X

దిశ,మణుగూరు : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలు 420 పథకాలని భద్రాది కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. మంగళవారం మణుగూరు మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీటీసీ పోశం నరసింహారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాలన్నీ 420 పథకాలని దుయ్యబట్టారు. ప్రకటించిన 6 పథకాలలో ఒక్కటంటే ఒకటి కూడా పేద ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు.

ప్రజలకు ఏదో మంచి చేసినట్టు విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసినందుకేనా..? వేడుకలని ఎద్దేవా చేశారు. తుపాకీ రాముడి మాట..రేవంత్ రెడ్డి పాలన ఒక్కటేనని ధ్వజమెత్తారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు 46 మంది విద్యార్థులు మృతి చెందితే నేటి వరకు ఒక్క రివ్యూ సమావేశం కూడా పెట్టలేని అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు, మంచి ఆహారం అందించలేక ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ కంపెనీ కోసం తిరుగుబాటు వచ్చి కంపెనీనే రద్దు చేసుకోవడం మీ ప్రజా పాలనకు నిదర్శనం అని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అధికారం ఉందని విర్రవీగి మా నాయకుల్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, నూకారపు రమేష్, ఎనిక ప్రసాద్, ముద్దంగుల కృష్ణ, వట్టం రాంబాబు, ప్రభుదాస్, ఖమ్మంపాటి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed