కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. జలగం ఎంట్రీతో మారిన సీన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-27 06:27:25.0  )
కొత్తగూడెంలో త్రిముఖ పోరు.. జలగం ఎంట్రీతో మారిన సీన్!
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: రాష్ట్ర రాజకీయాలతో పోల్చుకుంటే కొత్తగూడెం నియోజకవర్గం రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ప్రధాన అభ్యర్థులుగా కొత్తగూడెం బరిలో నిలవగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు సింహం గుర్తుతో ఎంటర్ అయ్యేసరికి గూడెం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల వద్ద నుండి సింహం గుర్తు అభ్యర్థి జలగం వెంకట్రావుకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఒకే ఒక స్థానం కొత్తగూడెం నియోజకవర్గం నుండి జలగం వెంకట్రావు విజయం సాధించారు. అనంతరం నాలుగున్నర సంవత్సరాల పాలనలో కొత్తగూడెం నియోజకవర్గంలో సాధ్యం కావనుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న నాలుగున్నర సంవత్సరాలు నో చందా నో దందా అన్న నినాదంతో రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేసిన ఘనత జలగం వెంకట్రావుకే దక్కుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లంచాలు కమిషన్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందేలా చూసి పేద, బడుగు బలహీన వర్గాలకు ఇంటి పెద్దల వ్యవహరించడం అందరు నాయకులకు సాధ్యం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఆడంబరాలకు దూరం,అభివృద్ధి ధ్యేయం..

సాధారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే భారీ కాన్వాయ్ చుట్టూ అనుచర గణంతో నాన హడావుడి చేస్తుంటారు. కానీ జలగం వెంకటరావు హయాంలో తాము ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజాధనం అన్న ఆలోచనతో ఆడంబరాలకు దూరంగా ఉంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై కృషి చేశారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడంలో జలగం వెంకట్రావుది అంది వేసిన చెయ్యి అని చెప్పవచ్చు. నియోజకవర్గంలో దూరమైన విద్యా, వైద్యం, ఉపాధి ప్రజలందరికీ అందించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి కేజీ టు పీజీ, 24 గంటలు అందుబాటులో వైద్యంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

అందుబాటులో లేకున్నా ప్రజలకు ఆపన్న హస్తం..

2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం జలగం వెంకట్రావు నియోజకవర్గంలో లేకున్నా ప్రజల సమస్యలపై ఎప్పుడి కప్పుడు ఆరా తీస్తూ వర్గ విభేదాలు ప్రజలకు శాపాలుగా మారవద్దు అన్న ఆలోచనతో గుట్టు చప్పుడు కాకుండా నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ మూడో కంటికి తెలవకుండా చేపించే వారని జలగం అభిమానులు అంటున్నారు. జలగం వెంకట్రావు పదవ తారీకు నామినేషన్ వేసిన అనంతరం సింహం గుర్తుతో ప్రజల మధ్యకు వెళ్లారు. మొదట్లో సింహం గుర్తు ప్రజల్లోకి చేరడానికి సమయం పడుతుందని ఊహించినప్పటికీ ప్రచారానికి వెళ్లిన జలగంకు ఊహించని స్పందన లభించింది.

చందాలు దందాలతో అలసిపోయిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పెద్ద పీట వేసే జలగం వెంకట్రావును ఆదరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వస్తున్న జలగం అభిమానులు 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో అభివృద్ధిని గెలిపించుతామని కొత్తగూడెం నియోజకవర్గంలో సింహం గర్జించడం ఖాయమని గంటా పదంగా చెబుతున్నారు.

Advertisement

Next Story