ప్రతి పనికీ ఓ రేటు..! అదే వైరా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం రూటు

by Shiva |
ప్రతి పనికీ ఓ రేటు..! అదే వైరా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం రూటు
X

దిశ, వైరా: వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించారు. ప్లాట్, ఇంటి రిజిస్ట్రేషన్ మొదలుకుని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వరకు ప్రతి దానికి నగదు చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. తాము నీతి నిజాయితీలతో పనిచేస్తున్నామని చెప్పే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లకు నగదును వసూలు చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఇక్కడ పనిచేసే ఓ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం అధికారులు మామూళ్ల రూపంలో ఒక్కో ఇంటికి రూ.7 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అందులో ఓ అధికారికి రూ.5వేలు, మిగిలిన రూ.2 వేలు కార్యాలయ సిబ్బందికి ఇస్తున్నట్లుగా డాక్యుమెంట్ రైటర్లే చెబుతున్నారు.

ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. అందులో రూ.500 కార్యాలయ సిబ్బందికి పోను మిగిలిన నగదు ఓ అధికారికి వెళ్తుందనే టాక్ వినిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా బహిరంగంగానే జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. తాము లింక్ డాక్యుమెంట్లతో పాటు అన్ని సక్రమంగా తీసుకెళ్లినా ఇళ్లకు ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారు. అలా అన్ని సక్రమంగా వాటికి రిజిస్ట్రేషన్ చేసేందుకు నగదు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రజలు సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.వేయి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి పనికీ అందినకాడికి దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇదంతా తమకు మామూలే అన్నట్లుగా జిల్లా ఉన్నతాధికారులు ఆ వ్యవహారాన్ని చూసిచూడనట్లుగా వదిలేస్తున్నారు.

డాక్యుమెంట్ రైటర్లే వసూలు చేసుకుంటున్నారేమో: రామచంద్రయ్య, సబ్ రిజిస్ట్రార్, వైరా

రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయంలో రూపాయి కూడా తీసుకోవడం లేదు. తమ కార్యాలయం పేరుతో డాక్యుమెంట్ రైటర్లే నగదు వసూలు చేస్తున్నారనే అనుమానం ఉంది. నేను నిజాయితీగా నిబద్ధతగా రూపాయి తీసుకోకుండా పని చేస్తున్నా. డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేసే నగదుకు నాకు సంబంధం ఏంటి. ఇటీవల ఓ డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో నాలుగు రోజులు రాత్రులు నిద్రించిన విషయాన్ని ప్రశ్నిస్తే.. తనకు వైరాలో లాడ్జీలు ఎక్కడున్నాయో తెలిక అక్కడ పడుకున్నానని అన్నాడు. ఇదే విషయం బయటకు వస్తే చీప్‌గా ఉంటుందని ఎవరికీ చెప్పలేదు.

Next Story

Most Viewed