అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం

by Javid Pasha |
అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం
X

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ లో అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం చేపట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రెండు డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్ల భర్తలు ఆక్రమార్కుడికి కొమ్ముకాస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టే పనిలో పడ్డారు. ఖమ్మం నగర పరిధిలో భూముల రేట్లు అమాంతం పెరగడంతో కొంతమంది వ్యక్తులు అడ్డదారిలో ఇంటి నిర్మాణాలు చేపడుతూ నిబంధనలకు పాతరేస్తున్నారు. దీనికోసం వారికున్న డబ్బుతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల భర్తలను కొనుగోలు చేస్తూ టౌన్ ప్లానింగ్ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయంపై పలు ఫిర్యాదులు రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ ఇంటి నిర్మాణదారుడికి నోటీసులు పంపించిన లెక్కచేయకుండా గత ఆరు నెలలుగా అర్ధ రాత్రి వేళల్లో కిరాయి గుండాల సహకారంతో ఇంటి నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఇంటికి రెండు దఫాలుగా స్లాబ్ వేయడంతో ఆ యజమాని పని పూర్తిస్థాయిలో అయిందనే చెప్పుకోవచ్చు.

మూడో పట్టణ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ భర్త, గట్టయ్య సెంటర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ భర్త ఇరువురు ఆక్రమ నిర్మాణదారునికి అంట కాగుతూ అధికార పార్టీ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నట్లు కొంతమంది బాధితులు వాపోతున్నారు. మేము చెప్పిందే చేయాలంటూ అటు అధికారులను, ఇటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారు అనుకున్నది చేసేందుకు వెనకాడడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి. వీరు చేస్తున్న చేష్టలకు అధికార పార్టీ పేరు దిగజారుతుందని సొంత పార్టీ వారే వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇస్త్రీ చేసిన కద్దర్ చొక్కా తొడుక్కొని నలుగురు మనుషుల్ని వెనకేసుకొని తిప్పుకుంటూ భూదందాల నుండి మొదలుకొని కుటుంబ తగాదాలు, కుల తగాదాలు, చేస్తూ వారి ఇష్టానికి చట్టాన్ని సైతం చుట్టంగా మార్చుకుంటూ పబ్బం గడుపుతున్నారనే విమర్శలు లేకపోలేదు.

వీరి మాట వినకపోతే చాలు కొంతమంది పోకిరిలను ప్రత్యర్థులపై కి పంపి వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ పెత్తనం చెలాయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరిపి అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో పలుచోట్ల వీరు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నప్పటికీ మొదట్లోనే వీరిపై చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. అధికార పార్టీ కి చెందినవారు కావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుందాం అనుకున్న పెద్ద స్థాయి నాయకులతో ఒత్తిళ్లు తెప్పించి వారి విధులకు భంగం కలిగిస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed