తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్‌గా కీలక నేత.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!

by Gantepaka Srikanth |
తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్‌గా కీలక నేత.. అధికారిక ప్రకటనకు ముహూర్తం ఫిక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అరవింద్ కుమార్ గౌడ్‌కు అప్పగించనున్నట్లు తెలిసింది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం విజయవాడలో ఇద్దరు భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, తదితర అంశాలు చర్చించినట్లు వెల్లడించాయి. కాగా, రాష్ట్ర అధ్యక్ష పోస్టుకు ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలించినా.. బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీనిపై శ్రావణమాసంలో అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది. అరవింద్ కుమార్ ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇటీవల ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబునాయుడు ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఈ నెల 19న టీటీడీపీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా.. ఏపీ అసెంబ్లీ మీటింగ్స్ నేపథ్యంలో అది వాయిదా పడింది. అయితే త్వరలో తెలంగాణలోని పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతారని, అప్పుడే పార్టీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పేర్లను ప్రకటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా బ్రాహ్మణికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆమెకే బాధ్యతలు అప్పగిస్తారా? మరొకరికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి.

నామినేటెడ్ పోస్టులు సైతం..

ఏపీలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులపై దృష్టిసారించింది. అందులో తెలంగాణలోని సీనియర్ నేతలు, పార్టీకోసం పనిచేస్తున్నవారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. టీటీడీ మెంబర్ లుగా నన్నూరి నర్సిరెడ్డితో పాటు మరొకరికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొంతమందిని పొలిట్ బ్యూరోలో, యాక్టీవ్ గా పనిచేసేవారిని రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. పార్టీ సీనియర్ నేతలు బక్కని నర్సింహులు, సామా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసినికి సైతం ఏదో ఒక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయి.. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed