తెలంగాణలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవకాశం.. అదంతా ఫేక్ న్యూసే..!

by GSrikanth |   ( Updated:2024-04-12 12:13:59.0  )
తెలంగాణలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి అవకాశం.. అదంతా ఫేక్ న్యూసే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, నిరుద్యోగులకు ఇక పండుగే అని వాట్సప్ గ్రూపుల్లో ఉదరగొడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారని, 33 ఏళ్ల సర్వీసు, 61 సంవత్సరాల వయో పరిమితి పూర్తైన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ న్యూస్ సారాంశం. ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోందని, ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు సీఎంవోకు పంపారని, ఎన్నికల కోడ్ తొలిగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆ న్యూస్‌లో రాసుకొచ్చారు.

అయితే ఇది ఫేక్ న్యూస్ అని సెక్రటేరియట్ అధికారులు కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణలో ఇలాంటి ప్రతిపాదన ఏమీలేదని అధికారులు వెల్లడించారు. ఉద్యోగులు ఎవరూ ఆ ఫేక్ వార్తను నమ్మవద్దని సూచించారు.

Advertisement

Next Story