రిపోర్టు వచ్చే వరకు తొందరొద్దు.. 111 జీవో అమలుపై హైకోర్టు

by GSrikanth |
రిపోర్టు వచ్చే వరకు తొందరొద్దు.. 111 జీవో అమలుపై హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రిపుల్ వన్ జీవో రద్దు తదనంతరం హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది. సమైక్య రాష్ట్రంలో 1996లో ఉనికిలోకి వచ్చిన జీవో 111 అమలుపై సర్కారు వైఖరికి నిరసనగా గతంలో హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఈ జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పర్యావరణవేత్తల్లో ఆందోళన మొదలైంది. ఆ పిటిషన్లన్నింటినీ ఈ నెల 22న విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ ఎన్ శ్రావణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు, ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను పది వారాల తర్వాతకు వాయిదా వేసింది.

ట్రిపుల్ వన్ జీవో అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం సహా మొత్తం పది రిట్ పిటిషన్లను కలిపి ఒకే కేసుగా హైకోర్టు విచారిస్తూ ఉన్నది. దాదాపు 2007 నుంచి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ నగర శివారులో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిరక్షించడంతో పాటు దాని చుట్టూ పది కి.మీ. పరిధి వరకు పర్యావరణ విఘాతం లేకుండా ఉండేందుకు ఉద్దేశించి అప్పటి ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు సైతం ఈ జీవోలోని అంశాలకు అనుగుణంగా ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేయాలని నొక్కిచెప్పి,దని గుర్తుచేశారు.

గతేడాది ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తలెత్తనున్న పర్యావరణ సవాళ్ళను పరిగణనలోకి తీసుకుని భీమిశెట్టి నవీన్ దాఖలు చేసిన పిటిషన్ సహా పెండింగ్‌లో ఉన్నవాటిని కలిపి హైకోర్టు విచారణకు తీసుకున్నది. పిటిషనర్లు లేవనెత్తిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు సైతం ఉన్నతస్థాయి కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని, అప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని డివిజన్ బెంచ్‌కు స్పష్టం చేశారు. దీన్ని అక్షరాలా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను పది వారాల తర్వాత విచారణకు చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed