స్థానిక సంస్థల ఎన్నికలపై పీసీసీ ఫోకస్.. మహేష్​కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
స్థానిక సంస్థల ఎన్నికలపై పీసీసీ ఫోకస్.. మహేష్​కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తానని​మహేష్​కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎల్పీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని వెల్లడించారు. రెండోసారి కూడా కాంగ్రెస్ పవర్‌లోకి రాబోతున్నదన్నారు. తాను నిత్యం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులపై మరింత ఎక్కువ బాధ్యత ఉన్నదన్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను గెలవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని, దీన్ని పకడ్భందీగా జనాల్లోకి తీసుకువెళ్తే సరిపోతుందన్నారు. కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశామని గుర్తు చేశారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లాడని, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణమని, రాహుల్‌ను ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలన్నారు. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదని, అందుకే ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కులం, మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉన్నదన్నారు. రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు సాగాలన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ లు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉంటాయని వివరించారు. కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకొని ముందుకు వెళ్తానని పీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్ వెల్లడించారు.

Next Story

Most Viewed