నెక్ట్స్ టైమ్ తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్.. MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |
నెక్ట్స్ టైమ్ తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్.. MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వంద రోజుల పాలనకు రెఫరెండంగా తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారని, కానీ కాంగ్రెస్‌పై ఆరు నెలల్లోనే ప్రజలకు నమ్మకం పోయిందనేది ఈ ఫలితాలతో రుజువైందని, ఇదే దానికి నిదర్శనమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యావత్ దేశంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశం పేరుతో ఫేక్ వీడియోలతో చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన ఈ విజయం మోడీదేనని ఏలేటి కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెడంగా చెప్పుకున్న సీఎం ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ‌లో బీజేపీ పెరుగుద‌ల స్పష్టంగా క‌నిపిస్తోందని, 2014లో ఒక ఎంపీ సీటు, 2019లో నాలుగు సీట్లు, ఇపుడు 8 సీట్లు గెలిచామంటే ప్రధాని మోడీ చ‌రిష్మా వ‌ల్లేనన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మ‌ళ్లీ గెలిస్తే రిజ‌ర్వేషన్లను ర‌ద్దు చేస్తుంద‌ని, కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన‌ట్లు వీడియా మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టడమే కాకుండా ఆ పార్టీకి బుద్ధిచెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో 14 సీట్లలో గెలుస్తామని చెప్పారని ఇప్పుడు 8 సీట్లకే వారిని ప్రజలు పరిమితం చేశారని ఎద్దేవాచేశారు. 16 సీట్లలో కాంగ్రెస్ దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసిన‌ప్పటికీ భంగ‌పాటు తప్పలేదన్నారు. ఈ ఫలితాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొద‌లైంద‌ని అర్థమవుతందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించిన ప్రజలకు ఏలేటి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో భవిష్యత్ భారతీయ జనతా పార్టీదేనని నొక్కిచెప్పారు.

Advertisement

Next Story